“ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడితే జరిగే ఘోరం ఇలా ఉంటాది” అని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడితే జరిగే ఘోరం వీడియోలో చూడొచ్చు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో ఫేస్బుక్ లో లభించింది. వీడియోని ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా గత సంవత్సరం ఫిబ్రవరిలో తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. అయితే, గుత్తా జ్వాలా ఈ వీడియోని షేర్ చేసిన పోస్టులో ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, అవగాహన కోసం ఈ వీడియోని చిత్రీకరించినట్టు స్పష్టంగా పేర్కొంది.
ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తరువాత, వివిధ కారణాల వలన ఆ ఫోన్ కాలిపోవడం లేదా బ్లాస్ట్ అవ్వడం వంటి సంఘటనలు గతంలో రిపోర్ట్ (ఇక్కడ మరియు ఇక్కడ) అయ్యాయి. నాసిరకపు బాటరీ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కానీ, వీడియోలో జరిగిన సంఘటన రిపోర్ట్ అయినట్టు మాకు ఇటీవల న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు.
ఇటీవల కాలంలో ఇలాంటి పలు అవగాహన కల్పించే వీడియోలను ప్రముఖ వ్యక్తులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్న ట్రెండ్ పెరుగుతోంది. ఐతే ఈ వీడియోలను కొందరు వివరణ భాగాన్ని తీసేసి నిజంగా జరిగిన సంఘటనలవంటూ, ఇవే వీడియోలను మతపరమైన అభియోగాలు చేస్తూ కూడా షేర్ చేస్తున్నారు. ఇలాంటి కొన్ని వీడియోల గురుంచి FACTLY రాసిన ఫాక్ట్ చెక్ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడితే జరిగే ఘోరం ఇలా ఉంటుంది అంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.