దేశంలో లాక్ డౌన్ ఉన్నందున రంజాన్ మాసంలో ఒక ముస్లిం యువతికి ఉదయం ఆహారం ఏర్పాటు చేసినందుకు RSS వారు ఒక పెద్దావిడను కొట్టారని చెప్తూ రెండు ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: లాక్ డౌన్ ఉన్నందున రంజాన్ మాసంలో ఒక ముస్లిం యువతికి ఉదయం ఆహరం ఏర్పాటు చేసినందుకు RSS వారు ఒక పెద్దావిడను కొట్టారు.
ఫాక్ట్ (నిజం): గాయపడిన యువతి ఫోటో పాతది. అది లాక్ డౌన్ లో తీసిన ఫోటో కాదు. ఫిబ్రవరి 2020 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని మొదటి ఫోటో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, దాన్ని తాజాగా తీసినట్టు అందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటో మీద కూడా 25 ఏప్రిల్ 2020 న తీసినట్టు టైం స్టాంప్ ఉంది. అయితే, అది ఎప్పుడు మరియు ఎక్కడ తీసారు అనేది FACTLY నిర్ధారించలేకపోయింది. కానీ, ఆ ఫోటో ఇంతకముందు ఇంటర్నెట్ లో షేర్ అయినట్టుగా మాత్రం ఎటువంటి ఆధారం దొరకలేదు.
పోస్టులోని గాయపడిన యువతి ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ఫిబ్రవరిలోనే చాలా మంది పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఫోటోని ఒకరు 23 ఫిబ్రవరి 2020 న పోస్ట్ చేసి, ఆ ఫోటోలోని మహిళ గుజరాత్ లో జరిగిన అల్లర్లలో ముస్లింల చేతుల్లో గాయపడినట్టు రాసారు. అయితే, దాంట్లో ఎంత వరకు నిజముందో FACTLY నిర్ధారించలేకపోయింది. కానీ, ఫోటో ఫిబ్రవరి నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నందున, దానికీ లాక్ డౌన్ కీ సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. అంతేకాదు, మొదటి ఫోటోలో ఉన్న యువతి మరియు గాయపడిన యువతి ఒకటని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు.
చివరగా, పాత ఫోటో పెట్టి, ‘లాక్ డౌన్ లో ఒక ముస్లిం యువతికి ఉదయం ఆహరం ఏర్పాటు చేసినందుకు ఆర్ఎస్ఎస్ వారు ఒక పెద్దావిడను కొట్టారు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?