కేరళలోని మలప్పురం జిల్లా కలెక్టర్ రాణి సోయమోయి, స్కూల్ పిల్లల మధ్య జరిగిన సంభాషణ అంటూ షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంభాషణలో కలెక్టర్ తను చిన్నప్పుడు మైకా గనుల్లో పని చేసిన విషయాలు, తను మేకప్ ఎందుకు వేసుకోదో అన్న విషయాలు పిల్లతో పంచుకుంటుంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న సంభాషణకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: కేరళలోని మలప్పురం జిల్లా కలెక్టర్ రాణి సోయమోయి, స్కూల్ పిల్లల మధ్య జరిగిన సంభాషణ.
ఫాక్ట్(నిజం): ఈ సంభాషణ నిజం కాదు. ఈ సంభాషణను హకీమ్ మొరయుర్ అనే మలయాళీ రచయితా రాసిన ‘త్రీ విమెన్’ అనే ఒక కథల పుస్తకం నుండి సేకరించారు. ఇది పూర్తిగా కల్పితం. ఇదే విషయాన్ని హకీమ్ మొరయుర్ దృవీకరించారు. పైగా పోస్టులోని ఫోటోలో ఉన్నది శైనామోల్ ఐఏఎస్, రాణి సోయమోయి కాదు. ఆమె గతంలో మలప్పురం కలెక్టర్‌గా పనిచేసింది. హకీమ్ మొరయుర్ రాసిన ఒక కల్పిత కథని శైనామోల్ ఐఏఎస్‌కి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ పోస్టులో మలప్పురం కలెక్టర్ రాణి సోయమోయి జీవిత కథ పేరుతో వైరల్ అవుతున్నది ఒక కల్పిత కథ. హకీమ్ మొరయుర్ అనే మలయాళీ రచయిత రాసిన ‘త్రీ విమెన్’ అనే కథల పుస్తకంలోని ‘షైనింగ్ ఫేసెస్’ అనే కథ నుండి సేకరించారు.
ఈ కథ మలప్పురం కలెక్టర్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో, దీనినిపై హకీమ్ మొరయుర్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చాడు. వైరల్ అవుతున్న కథ తాను రాసిన పుస్తకంలోనిదని, తన కథలోని హీరోయిన్ పేరు కూడా రాణి సోయమోయి అని, తన పుస్తకంలోని కథని వేరొక మహిళకు ఆపాదిస్తూ, నిజమైన కథలా షేర్ చేస్తున్నారని స్పష్టం చేసాడు. అలాగే తన పుస్తకంలోని ఈ కథని ఉన్న పేజీ ఫోటోని కూడా షేర్ చేసాడు.
ఇకపోతే వైరల్ పోస్టులో షేర్ చేసిన మహిళ ఫోటో శైనామోల్ అనే ఐఏఎస్‌ది. ఈమె గతంలో మలప్పురం కలెక్టర్‌గా పనిచేసింది (ఇక్కడ మరియు ఇక్కడ). ప్రస్తుతం మలప్పురం కలెక్టర్‌గా వేరే వ్యక్తి ఉన్నారు. దీన్నిబట్టి, హకీమ్ మొరయుర్ రాసిన ఒక కల్పిత కథని, శైనామోల్ ఐఏఎస్ ఫోటోతో పాటు షేర్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది.
చివరగా, ఒక కల్పిత కథని మలప్పురం కలెక్టర్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలంటూ షేర్ చేస్తున్నారు.