Fake News, Telugu
 

ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత దేశ జెండాని అవమానిస్తున్న పాత ఫోటోని రైతుల అందోళనలకు తప్పుగా ముడిపెడుతున్నారు

0

కొందరు వ్యక్తులు భారత దేశ జెండాని తొక్కుతూ అవమానిస్తున్న ఫోటోని షేర్ చేస్తూ, ఈ ఘటన ఢిల్లీలో రైతులు  చేస్తున్న ఆందోళనల్లో జరిగిందని అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీలో రైతులు  చేస్తున్న ఆందోళనల్లో కొందరు వ్యక్తులు భారత దేశ జెండాని తొక్కుతూ అవమానించారు.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో ‘Dal Khalsa. U.K’ అనబడే ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ 2013లో భారత స్వాతంత్ర దినోత్సవం నాడు లండన్ లో భారత్ కి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించింది. ఈ ఫోటోలో భారత జెండాని అవమానిస్తూ కనిపిస్తున్న సిక్కు వ్యక్తి ‘Dal Khalsa. U.K’ వ్యవస్థాపకుడు. ఈ ఫోటోకి ఇప్పుడు ఢిల్లీలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని షేర్ చేసిన కొన్ని పాత సోషల్ మీడియా పోస్టులు కనిపించాయి, ఈ పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ ఫోటో పాతదని చెప్పొచ్చు. పోస్టులో ఉన్న ఫోటోలో మరియు పాత పోస్టుల్లో ఉన్న ఫోటోలో ‘Dal Khalsa. U.K’ లోగో కనిపిస్తుంది. దిని ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో ‘Dal Khalsa. U.K’ అనే బ్లాగ్ లో కనిపించింది. ఈ బ్లాగ్ లో ఇండియాలో మైనారిటీల పట్ల జరుగుతున్న అణచివేతకి వ్యతిరేఖంగా 15 ఆగస్ట్ 2013న సెంట్రల్ లండన్ లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సిక్కులు, కాశ్మీరీలు మరియు ఇతర మైనారిటీ వర్గాలు పాల్గొన్నప్పటి సందర్భంలో ఈ ఫోటో తీసినట్టు ఉంది. ‘Dal Khalsa’ అనేది సిక్కుల కోసం ప్రత్యేక దేశం కోసం పోరాడే ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ.

ఈ నిరసనలకు సంబంధించి భారత దేశ జెండాని అవమానించిన మరికొన్ని ఫోటోలు కూడా ఈ బ్లాగ్ లో చూడొచ్చు. 2015 భారత స్వతంత్రత దినోత్సవం రోజున ‘Dal Khalsa. U.K’ లండన్ లో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. పోస్టులోని ఫోటోలో భారత దేశ జెండాని అవమానిస్తూ కనిపిస్తున్న సిక్కు వ్యక్తి  ‘Dal Khalsa. U.K’ వ్యవస్థాపకుడు మన్మోహన్ సింగ్ ఖల్సా అని తెలిసింది. వీటన్నిటి బట్టి ఈ ఫోటోకి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతుల అందోళనలకు ఎటువంటి సంబంధంలేదని చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, ఖలిస్తాన్ మద్దతుదారులు 2013లో లండన్ లో భారత్ కి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని ఇప్పుడు జరుగుతున్న రైతుల అందోళనలకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll