ఛార్‌ధామ్‌లో భాగమైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాధ్, బదిరీనాధ్ క్షేత్రాలను కలుపుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 4 లైన్ల రహదారులు అంటూ ఒక ఫోటోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. 2020 మార్చి నుంచి ఈ రహదారి అందుబాటులో ఉన్నది అంటూ ఈ పోస్ట్‌లో ఛార్‌ధామ్‌లో రోడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రత్యేకతలు వివరిస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఛార్‌ధామ్‌లో భాగమైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాధ్, బదిరీనాధ్ క్షేత్రాలను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఫోటో.
ఫాక్ట్(నిజం): 2016లో ప్రారంభించిన ఛార్‌ధామ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 825 కి.మీ పొడవు గల ఈ ప్రాజెక్ట్‌లో 683 కి.మీ పొడవు రోడ్డు పనులు ఇప్పటికే మంజూరు అయ్యాయి. వీటిలో కూడా 291 కి.మీల పొడవు పనులు పూర్తయ్యాయి, 366 కి.మీ పొడవు వివిధ దశల్లో ఉన్నాయి. ఇకపోతే, పోస్టులో షేర్ చేసిన ఫోటో ఖండాలా ఘాట్ ప్రాంతంలోని ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేకి సంబంధించింది. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు
కేంద్ర ప్రభుత్వం 2016లో ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయాల్లో ఉన్న నాలుగు ప్రధాన హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రిలను కలుపుతూ ఆల్-వెదర్ కనెక్టివిటీని అందించడానికి చార్‌ధామ్ రోడ్ ప్రాజెక్ట్ ప్రారంభించింది.
ఐతే ఈ పోస్టులో చెప్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ మార్చ్ 2022లో పూర్తి కావాల్సి ఉన్నా, కోర్టు కేసులు మొదలైన కారణాల వల్ల ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల డిసెంబర్ 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అందించిన సమాచారం ప్రకారం మొత్తం 825 కి.మీ పొడవు గల (53 ప్యాకేజీలు) ఈ ప్రాజెక్ట్‌లో 683 కి.మీ పొడవు (43 ప్యాకేజీలు) రోడ్డు పనులు ఇప్పటికే మంజూరు అయ్యాయి.
వీటిలో కూడా 291 కి.మీల పొడవు (21 ప్యాకేజీలు) పనులు పూర్తయ్యాయి, 366 కి.మీ పొడవు (19 ప్యాకేజీలు) వివిధ దశల్లో ఉన్నాయి.

దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ 2020లోనే పూర్తి అయ్యిందన్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది. ఐతే పోస్టులో షేర్ చేసిన ఫోటో కూడా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించింది కాదు. ఈ ఫోటోలో ఉన్నది ఖండాలా ఘాట్ ప్రాంతంలోని ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేకి సంబంధించినది.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోను ఒక ఫోటోగ్రాఫర్ ఆన్లైన్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఇదే రోడ్డుకు సంబంధించిన మరికొన్ని ఫోటోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వేకి సంబంధించిన ఫోటోను ఛార్‌ధామ్ రోడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించినది అంటూ షేర్ చేస్తున్నారు.