అయోధ్యలో దీపావళి పండగ సందర్భంగా భక్తులు రోడ్డు పక్కన దీపాలతో నిలిచున్న దృశ్యం అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వందలాది మహిళలు ఒక రోడ్డు పక్కన వరుసగా దీపాలతో నిలిచున్న ఫోటో, ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్యలో దీపావళి పండగ సందర్భంగా వందలాది భక్తులు రోడ్డు పక్కన దీపాలతో నిలిచున్న దృశ్యం.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. 2018లో సుప్రీం కోర్ట్ శబరిమల దేవాలయంలోకి స్త్రీలని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశాలని వ్యతిరేకిస్తూ కేరళ మహిళలు ఇలా రోడ్డుల పై దీపాలతో నిలుచోని నిరసన తెలిపారు. CPI(M) పార్టీ నిర్వహించాలనుకున్న ‘Women Wall’ కార్యక్రమానికి వ్యతిరేకంగా శబరిమల దేవస్థాన యాజమాన్యం ‘Ayyappa Jyothi’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫోటోకి అయోధ్యలోని రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Swarajya’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. 2018లో కేరళ రాష్ట్రంలో నిర్వహించిన ‘Ayyappa Jyothi’ కార్యక్రమానికి సంబంధించిన ఫోటో ఇదని ఆర్టికల్ లో తెలిపారు. సుప్రీం కోర్ట్ శబరిమల దేవాలయంలోకి స్త్రీలని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశాలని వ్యతిరేకిస్తూ వేలమంది మహిళలు ఇలా దీపాలతో నిలిచున్నట్టు అందులో తెలిపారు.
సుప్రీమ్ కోర్ట్ శబరిమల దేవస్థానానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలకి సంఘీభావం తెలుపుతూ CPI(M) పార్టీ ‘Women Wall’ అనే కార్యక్రమాన్ని జనవరి 2019లో నిర్వహించాలనుకుంది. CPI(M) పార్టీ నిర్వహించాలనుకున్న ‘Women Wall’ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ శబరిమల దేవస్థాన యాజమాన్యం ‘Ayyappa Jyothi’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 795 కిలోమీటర్ల దూరం వరకు కేరళ మహిళలు ఇలా దీపాలతో నిలిచున్నట్టు పలు న్యూస్ వెబ్ సైట్స పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
దీపావళి పండగ సందర్భంగా అయోధ్యలోని రామ మదిరం దీపాలతో అలంకరించిన మాట వాస్తవం. కానీ, పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో అయోధ్య రామ మందిరానికి సంబంధించింది కాదు.
చివరగా, కేరళ రాష్ట్రానికి సంబంధించిన పాత ఫోటోని చూపిస్తూ అయోధ్య రామ మందిర సమీపంలో దీపాలతో నిలిచున్న వందలాది మహిళలంటూ షేర్ చేస్తున్నారు.