‘ఢిల్లీ లో రైతులు పోరాటం చేస్తున్న ప్రదేశంలో వారికి ఆహరం అందిస్తున్న చిట్టి తల్లి’, అని షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీ లో జరుగుతున్న రైతు ఉద్యమంలో ఒక చిన్నారి ఆహరం పంచుతున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. 2017లో ఇదే ఫోటోని ఒక యూసర్ తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసారు. ఈ ఫోటోకి ఇటివల రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Guru Ka Langar’ అనే కమ్యూనిటీ తన ఫేస్బుక్ పేజిలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని ‘14 July 2017’ నాడు పోస్ట్ చేసారు. హిమాచల్ ప్రదేశ్ లోని పావుంట సాహిబ్ అనే ప్రదేశంలో ఈ ఫోటో తీసినట్టు అందులో తెలిపారు.
ఈ ఫోటోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, ఈ ఫోటో ఇటివల రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, సంబంధం లేని పాత ఫోటోని చూపిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో ఓ చిన్నారి ఆహరం పంచుతున్న ఫోటో అని షేర్ చేస్తున్నారు.