Fake News, Telugu
 

బరాక్ ఒబామా 2016 థాంక్స్ గివింగ్ విందు వీడియోని ఇప్పుడు తను హోటల్ సర్వర్ గా పనిచేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ప్రపంచ దేశాలను పాలించే అమెరికా కు అధ్యక్షుడిగా పని చేసిన ఒబామా, ఇప్పుడు తన కుటుంబ పోషణ కోసం సర్వర్ గా పనిచేస్తున్న విధానం చుడండంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కుటుంబ పోషణ కోసం బరాక్ ఒబామా హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో 2016లో ఒబామా అధ్యక్ష పదవిలో ఆర్మీ ఆఫీసర్లకి ఇచ్చిన విందు కార్యక్రమంలో తీసినది. అమెరికా అధ్యక్ష పదవి ముగిసిన తరువాత ఒబామా కొన్ని వాల్ స్ట్రీట్ ఫర్మ్స లలో ఉపన్యాసాలు ఇచ్చాడు. 2020లో తను రాసిన ‘A Promised Land’ పుస్తకాన్ని ఒబామా విడుదల చేసాడు. అంతే కానీ, ఎక్కడా కూడా సర్వర్ గా చెయ్యలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని  ‘ABC News’ ఛానల్ ‘28 నవంబర్ 2016’ నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్లకి ఇచ్చిన విందు కార్యక్రమంలో బరాక్ ఒబామా మరియు అతని కుటుంబం అతిధులకి వడ్డిస్తున్న దృశ్యాలు, అని వీడియో వివరణలో తెలిపారు.

‘AP Archive’ న్యూస్ ఛానల్ ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘28 నవంబర్ 2016’ నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వాషింగ్టన్ లో ‘24 నవంబర్ 2016’ నాడు ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్లకి ఇచ్చిన విందులో, ఒబామా మరియు అతని కుటుంబం ఆఫీసర్లకి విందు వడ్డిస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. బరాక్ ఒబామా తన అమెరికా అధ్యక్ష పదవి ముగుస్తున్న నేపథ్యంలో, ఆర్మీ ఆఫీసర్లకి ఇలా థ్యాంక్స్ గివింగ్ విందు ఏర్పాటు చేసారు. ఇదే విషయం తెలుపుతూ అమెరికా జాతీయ న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేసిన వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తీసినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అమెరికా అధ్యక్ష పదవి ముగిసిన తరువాత బరాక్ ఒబామా కొన్ని వాల్ స్ట్రీట్ ఫర్మ్స లలో ఉపన్యాసాలు ఇచ్చాడు. అమెరికా అధ్యక్షుడిగా ఇచ్చిన చివరి స్పీచ్ లో తను రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ, 2020 లో డోనాల్డ్ ట్రంప్ కరోన వైరస్ ని , అమెరికా ఆర్ధిక పరిస్థితులని హాండిల్ చేస్తున్న తీరుని ఒబామా విమర్శించారు. ఇటివలే, తను రాసిన ‘A Promised Land’ పుస్తకాన్ని ఒబామా విడుదల చేసాడు. అంతే కానీ, ఎక్కడా కూడా సర్వర్ గా చెయ్యలేదు

చివరగా, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష పదవిలో ఇచ్చిన విందులో తీసిన ఫోటోని ఇటీవల కుటుంబ పోషణ కొరకు ఒబామా హోటల్ సర్వర్ గా పనిచేస్తున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll