Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోలను పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

22 ఏప్రిల్ 2025న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, 07 మే 2025న భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని పలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ దాడులు లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల శిబిరాలపైనే జరిగాయని, పాక్ సైనిక స్థావరాలను తాకలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంపై భారత దాడి చేసినట్లు ధృవీకరించింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). భారత సైనిక వర్గాల ప్రకారం, ఈ దాడిలో కనీసం 80 మంది ఉగ్రవాదులు మరణించారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో ఈ దాడుల్లో కనీసం 26 మంది పాక్ పౌరులు మరణించారని, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ దళాలు సరిహద్దు వెంబండి జరిపిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్‌లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించారని, 38 మంది గాయపడ్డారని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. 07 మే 2025న, ఉదయం 10 గంటలకు, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి మీడియాకు వివరించింది, అలాగే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పలు వీడియోలను కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించింది.

ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన దృశ్యాలు అంటూ  పలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఈ వీడియోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 07 మే 2025న పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం):  పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా, 07 మే 2025న పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని పలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. కానీ ఈ వైరల్ వీడియోలు పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించినవి కావు. ఈ వీడియోలు 07 మే 2025 జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో-1:

పేలుళ్ల మధ్య ప్రజలు పరిగెడుతున్నట్లు చూపిస్తున్న ఓ వీడియోను పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోను, 09 నవంబర్ 2023న X(ట్విట్టర్)లో జర్నలిస్ట్ బేకర్ అట్యాని అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిని చూపిస్తుందని ఈ పోస్టు వివరణలో పేర్కొన్నారు. ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ మీడియా సంస్థ ‘అల్ జజీరా’ & ‘ది సన్’ ప్రచురించిన వార్త కథనాలు కూడా లభించాయి. ఈ నివేదికల ప్రకారం, ఈ వీడియో ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రి చుట్టూ ఉన్న ప్రాంతంపై 09 నవంబర్ 2023న ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు చేసిన దాడినీ చూపిస్తుంది. దీన్ని బట్టి ఈ వీడియో పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

వీడియో-2:

పలు భవనాలపై క్షిపణి దాడులను చూపిస్తున్న ఓ వీడియోను పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను 02 అక్టోబర్ 2024న భారత ప్రభుత్వానికి చెందిన మీడియా సంస్థ ‘DD ఇండియా’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినట్లు మేము గుర్తించాము. అలాగే వైరల్ వీడియోలో కూడా మనం ‘DD ఇండియా’ లోగో చూడవచ్చు. ఈ వీడియో వివరణ ప్రకారం, ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారిలోని నెవాటిమ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరానియన్ క్షిపణులు చేసిన దాడి దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వీడియో పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

వీడియో-3:

ఓ ప్రదేశంలో పలు పేలుళ్లను చూపిస్తున్న ఓ వీడియోను పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు (ఇక్కడఇక్కడఇక్కడ).

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, రెండేళ్ల క్రితం ఇదే వీడియోను 23 అక్టోబర్ 2023న అఫ్గానిస్తాన్ మీడియా సంస్థ ‘కాబూల్ న్యూస్ టీవీ’ X(ట్విట్టర్)లో షేర్ చేసినట్లు మేము గుర్తించాము. ఈ వీడియో అక్టోబర్ 2023లో గాజాపై ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడులను చూపిస్తుందని ఈ పోస్టు వివరణలో పేర్కొన్నారు. ఈ దృశ్యాలు రిపోర్ట్ చేస్తూ అక్టోబర్ 2023లో గాజాపై ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడులు చేసింది అని పేర్కొంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలకు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

వీడియో-4:

భారత గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లపై దాడి చేస్తున్న దృశ్యాలను అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడఇక్కడఇక్కడ & ఇక్కడ).

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో 07 మే 2025 జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని తెలిసింది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే విమానంపై ఫిరంగి కాల్పులు అకస్మాత్తుగా మాయమైపోవడాన్ని చూడవచ్చు. వాస్తవానికి ఇది ఒక వీడియో గేముకు సంబంధించిన వీడియో. దీన్ని బట్టి ఈ వీడియో పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

వీడియో-5:

పలు రాకెట్లను, క్షిపణులు ప్రయోగిస్తున్నట్లు చూపిస్తున్న ఓ వీడియోను పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో 07 మే 2025 జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో మేము నిర్ధారించలేకపోయినా వైరల్ వీడియోకు పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ఎలాంటి సంబంధం లేదని కాదని మేము నిర్ధారించగలము.

వీడియో-6:

పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ ను భారత్ నేలకూల్చిన వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో 07 మే 2025 జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని తెలిసింది. ఈ వీడియోను 19 ఏప్రిల్ 2025న‘S-401 ఎయిర్ డిఫెన్స్ టార్గెటెడ్ FPV డ్రోన్! ఎపిసోడ్ 115′ అనే క్యాప్షన్‌తో ‘Coffin Gaming’ అనే గేమింగ్ ఛానల్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది.గతంలో ఛానల్ ఇలాంటి గేమింగ్ వీడియోలు క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది. దీన్ని బట్టి ఈ వీడియో పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోలను పాకిస్తాన్‌పై భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll