Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోలని, ఈజిప్ట్ ప్రజలు పాలస్తీనా ప్రజలకి ఆహారం తీసుకెళ్తున్న దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇజ్రాయెల్  పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కొందరు తమ భుజాలమీద బస్తాలను మోసుకెళ్తున్న విడియోలని (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తూ, పాలస్తీనా ప్రజల కోసం ఈజిప్టు ప్రజలు ఆహారం తీసుకెళ్తున్న దృశ్యాలు ఇవి అని సోషల్ మీడియాలో క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఈ వీడియోలు ఈజిప్ట్ దేశస్థులు పాలస్తీనా వారి కోసం ఆహారం తీసుకెళ్తున్న దృశ్యాలు చూపిస్తున్నాయి. 

ఫాక్ట్(నిజం): ఈ రెండు వీడియోలూ హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసిన 7 అక్టోబర్ 2023 కంటే ముందు నుండే ఇంటెర్నెట్‌లో ఉన్నాయి. వీటికీ, ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియో 1

వీడియో గురించి వివరాలు తెలుసుకోవడానికి ఇందులోని కొన్ని కీ  ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటెర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో నైజీరియాకు చెందినది అని తెలిసింది. 

1 అక్టోబర్ 2023 నాడు నైజీరియాలోని యోబ్ స్టేట్‌లో ఉన్న బారా పట్టణంలో ఆరువేలకి పైన గృహాలకి palliatives (పాలియేటివ్స్) సప్లై చేశారు.  వైరల్ వీడియో ఈ కార్యక్రమానికి చెందినది. ఈ వీడియోని యోబ్ స్టేట్‌ గవర్నర్ మై మల బూని యొక్క స్పెషల్ అసిస్టెంట్ హస్సన్ పెప్పే 1 అక్టోబర్ 2023 నాడు ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేసాడు. 

ఇదే కార్యక్రమానికి చెందిన మరొక వీడియోని యోబ్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వారు తమ X (గతంలో Twitter)లో పోస్టు చేశారు.

నైజీరియాకు చెందిన ఒక సర్జన్, లాయర్ ఈ వీడియోని షేర్ చేస్తూ వారి స్పందనని వ్యక్తపరిచారు (ఇక్కడ, ఇక్కడ). 

వీడియో 2

వైరల్ వీడియోలో కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటెర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇదే వీడియోని ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మొదలైన రోజు 7 అక్టోబర్ 2023 కంటే చాలా ముందు (సెప్టెంబర్ 2023) నుండే ఇంటెర్నెట్‌లో ఉన్నట్లు అర్ధం అయ్యింది. 

ఈ వీడియోను X (గతంలో ట్విట్టర్)లో యూజర్లు షేర్ చేస్తూ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఈ దృశ్యాలు లిబియా – ఈజిప్ట్ సరిహద్దులో తీసినవిగా వివరించారు. 

ఇదే వీడియోని ఈజిప్ట్ నుండి లిబియాకి చట్టవిరుద్ధంగా వలస వెళ్తున్న వారి దృశ్యాలు అని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, ఇందులో ఉన్నది స్మగ్లర్లని చెప్తూ misbar అనే అరబిక్ ఫాక్ట్ చెక్ సంస్థ ఆర్టికల్ ప్రచురించింది. 

చివరిగా, సంబంధం లేని పాత వీడియోలని, ఈజిప్ట్ ప్రజలు పాలస్తీనా ప్రజలకి ఆహారం తీసుకెళ్తున్న దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll