ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా ఎక్కువగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసు దుస్తుల్లో ఉన్న వారు నిరసనకారుల గుంపును కొట్టడం మనం చూడొచ్చు. సోషల్ మీడియాలో ప్రస్తుతం షేర్ చేస్తున్న పోస్టుల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని మొఘల్ కాలం నాటి జామా మసీదు వద్ద కోర్టు ఆదేశించిన సర్వేకు వ్యతిరేకంగా ఇటీవలి నిరసనల సందర్భంగా జరిగిన లాఠీ ఛార్జ్ దృశ్యాలను ఈ వీడియో చూపిస్తోంది. ఈ ఆర్టికల్ ద్వారా దీంట్లో నిజమెంతో తెలుసుకుందాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదుపై కోర్టు ఆదేశించిన సర్వేకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన లాఠీ ఛార్జ్ వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 20 డిసెంబర్ 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నఖాస్ చౌక్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించినది. అప్పట్లో సిటిజెన్షిప్ ఆమెండమెంట్ ఆక్ట్ (CAA)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో, పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ వీడియోకు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన నిరసనలతో ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియో నుంచి కీ ఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, జనవరి 2020న ఫేస్బుక్ పోస్ట్‌కు (ఆర్కైవ్) దారితీసింది. ఈ పోస్ట్‌లో అదే వీడియో మెరుగైన రిజల్యూషన్‌లో ఉంది, అది ఉత్తరప్రదేశ్‌లో CAA వ్యతిరేక నిరసనల సందర్భంగా పోలీసుల లాఠీ ఛార్జ్‌ను చూపుతుందని పేర్కొన్నారు. అదనంగా, మా శోధనలో డిసెంబర్ 2019లో అప్లోడ్ చేసిన YouTube వీడియోకు దారితీసింది, ఇది CAA వ్యతిరేక నిరసనల సమయంలో పోలీసుల యాక్షన్‌కు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది అని పేర్కొన్నారు.

వీడియో యొక్క వివరణలోని క్లూలను తీసుకొని, వెతికితే ఈ సంఘటన గురుంచి వివరించే 20 డిసెంబర్ 2019న లైవ్ హిందుస్థాన్ YouTube ఛానెల్ ప్రచురించిన వార్తా నివేదికకు (ఆర్కైవ్) దారితీసింది. “గోరఖ్‌పూర్: CAA వ్యతిరేకంగా జరిగిన నిరసనలో రాళ్లదాడి, లాఠీ ఛార్జిలో ఇద్దరు గాయపడ్డారు” అనే టైటిల్‌తో ప్రచురించిన ఈ కథనం ప్రకారం, 2019 డిసెంబర్ 20న గోరఖ్‌పూర్‌లోని నఖాస్ చౌక్ వద్ద CAA వ్యతిరేక నిరసనల సమయంలో పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అదే లాఠీ ఛార్జ్‌ను వేరే సైడ్ నుండి తీసిన వీడియోను వార్తా కథనంలో చూపించారు.
మేము వైరల్ వీడియో, 2019 వార్తా కథనంలో చూపించిన వీడియోలోని ప్రదేశం ఒకటే అని గుర్తించాము. వాటిని క్రింద చూడవచ్చు.

మేము గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఈ లొకేషన్, నఖాస్ చౌక్, కోటవాలి రోడ్, మియాన్ బజార్, గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ అని నిర్ధారించాము. అదే సంఘటనకు సంబంధించిన ఇతర వార్తా కథనాలని కూడా మేము కనుగొన్నాము (ఇక్కడ మరియు ఇక్కడ).
ఇంతకుముందు కశ్మీరీలపై భారత సైన్యం అణిచివేతకు పాల్పడిందన్న తప్పుడు వాదనలతో వైరల్ అయిన ఇదే వీడియోని Factly ఫ్యాక్ట్-చెక్ చేసింది.
చివరిగా, 2019లో గోరఖ్‌పూర్‌లోజరిగిన CAA వ్యతిరేక నిరసన వీడియోని ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సంభాల్ నిరసన అని తప్పుగా షేర్ చేస్తున్నారు.