Fake News, Telugu
 

గుడ్ మార్నింగ్ మెసేజీల ద్వారా హ్యాకర్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారన్న వార్తలో నిజం లేదు

0

గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మొదలైన చిత్రాలు, వీడియోలలో ఫిషింగ్ కోడ్లని పొందపరిచడం ద్వారా హ్యాకర్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారని, కాబట్టి ఈ మెసేజీలను ఎవరికీ పంపవద్దని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మొదలైన చిత్రాలు, వీడియోలలో ఫిషింగ్ కోడ్లని పొందపరిచడం ద్వారా హ్యాకర్లు డేటా దొంగలిస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): ఇలా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మొదలైన మెసేజీల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నట్టు ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని లేవు. ఇదే వార్త సోషల్ మీడియాలో 2017 నుండి షేర్ అవుతూ ఉంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హ్యాకర్లు ఇలా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మొదలైన మెసేజీల ద్వారా డేటా దొంగలిస్తున్నట్టు, ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఒకవేళ ఇలా నిజంగానే జరుగుతుంటే, వార్తా సంస్థలు ఈ విషయానికి సంబంధించి కథనాలను ప్రచురించేవి. కానీ, ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.

మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్సైటులో గాని లేక సైబర్ దాడులకు సంబంధించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెబ్సైటులో గాని ఈ విషయం గురించి ఎటువంటి సమాచారం లేదు.

పైగా పోస్టులో ఈ వార్తని షాంఘై చైనా ఇంటర్నేషనల్ న్యూస్ నుండి సేకరించినట్టు పేర్కొన్నారు, కాని ఇంటర్నెట్‌లో వెతకగా ఈ పేరుగల వార్తా సంస్థ గురించి మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఇదే వార్త 2017 (ఇక్కడ మరియు ఇక్కడ ) నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. వీటన్నిటి బట్టి ఈ వార్త పాతదని, ఈ వార్తలో నిజం లేదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, గుడ్ మార్నింగ్ మెసేజీల ద్వారా హ్యాకర్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తున్నారన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll