జాతీయ భద్రతా సలహాదారుడు (NSA) అజిత్ దోవల్ ఇటీవల ఢిల్లీలో ముస్లిం మత పెద్దలను కలిసి ఉమ్మడి పౌర స్మృతిపై (UCC) చర్చించారని చెప్తున్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ముస్లిం పెద్దలతో అజిత్ దోవల్ మాట్లాడుతున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ “ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం UCC మీద షరియా కారణంగా వెనక్కు తగ్గాల్సి వస్తే, ముస్లిం (ఆడ/మగ) అందరికీ షరియా క్రిమినల్ కోడ్ వర్తింప చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేస్తే మీకు అంగీకారమేనా అని అజిత్ దోవల్ వారిని అడగగా, వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి UCCకి సమ్మతి తెలిపారు ” అని చెప్పారని ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అజిత్ దోవల్ ఇటీవల ఢిల్లీలో ముస్లిం మత పెద్దలను కలిసి ఉమ్మడి పౌర స్మృతిపై (UCC) మరియు షరియా క్రిమినల్ కోడ్ చర్చించారు.
ఫాక్ట్(నిజం): అజిత్ దోవల్ ఈ మధ్యకాలంలో ఉమ్మడి పౌర స్మృతిపై లేదా ముస్లింలందిరికీ షరియా క్రిమినల్ కోడ్ వర్తింపచేయడానికి సంబంధించి ముస్లిం పెద్దలతో మాట్లాడినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. వైరల్ ఫోటో 2020లో అయోధ్య తీర్పు వెలువడిన నేపథ్యంలో అజిత్ దోవల్ తన నివాసంలో ముస్లిం పెద్దలను కలిసి చర్చించిన సందర్భానికి సంబంధించింది. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
జాతీయ భద్రతా సలహాదారుడు (NSA) అజిత్ దోవల్ ఈ మధ్యకాలంలో ఉమ్మడి పౌర స్మృతిపై లేదా ముస్లింలందిరికీ షరియా క్రిమినల్ కోడ్ వర్తింపచేయడానికి సంబంధించి ముస్లిం పెద్దలతో మాట్లాడినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఒకవేళ ఇలాంటి ఒక పరిణామం జరిగుంటే మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి వార్తా కథనాలేవి కనిపించలేదు.
ఇదిలా ఉండగా, వైరల్ పోస్టులో షేర్ చేసిన ఫోటో 2020లో అయోధ్య తీర్పు వెలువడిన అనంతరం అజిత్ దోవల్ తన నివాసంలో ముస్లిం పెద్దలను కలిసి చర్చించిన సందర్భానికి సంబంధించింది. కేవలం ముస్లిం పెద్దలతో మాత్రమే కాకుండా హిందూ మత పెద్దలతో కూడా చర్చించి సుప్రీంకోర్టు తీర్పు అనతరం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చూడాలని కోరారు.
ఐతే ఇటీవల అజిత్ దోవల్ ఢిల్లీలోని ‘ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో’ ఖుస్రో ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌదీ అరేబియా మాజీ మంత్రి, ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ మహ్మద్ బిన్ అబ్దుల్కరీమ్ అల్-ఇస్సాతో వేదికను పంచుకున్నారు. అల్-ఇస్సా తన ప్రసంగంలో భారతదేశంలోని సర్వమత సామరస్యం మరియు లౌకిక రాజ్యాంగాన్ని ప్రశంసించారు.
ఐతే దేశంలో ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అల్-ఇస్సా మరియు అజిత్ దోవల్ కలవడాన్ని UCCకి ముడిపెడుతూ వార్తలు రావడంతో ఖుస్రో ఫౌండేషన్ ఈ వార్తలను ఖండించింది. ఈ కార్యక్రమంలో అల్-ఇస్సా గాని అజిత్ దోవల్ గాని UCC గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో అల్-ఇస్సా మరియు అజిత్ దోవల్ చేసిన ప్రసంగం ఇక్కడ చూడొచ్చు. బహుశా ఈ కార్యక్రమాన్ని తప్పుగా అర్ధం చేసుకొని అజిత్ దోవల్ ఉమ్మడి పౌర స్మృతి విషయంలో ముస్లిం పెద్దలను ఒప్పించాడని సోషల్ మీడియాలో వార్తలు షేర్ చేసి ఉంటారు.
చివరగా, UCC నేపథ్యంలో అజిత్ దోవల్ ముస్లిం మత పెద్దల దగ్గర షరియా క్రిమినల్ కోడ్ ప్రస్తావించి UCC అమలుకు ఒప్పించాడన్న వార్తలో నిజం లేదు