Fake News, Telugu
 

వీడియోలోని ‘కంచి కామకోటి పీఠం’ ఏనుగు ఘటనకు, ‘PETA’ సంస్థకి ఎటువంటి సంబంధం లేదు

0

కంచి ఆలయ ఆవరణలో ఉండే ఏనుగుని తరలించిడానికి PETA – People for the Ethical Treatment of Animals సంస్థ ప్రయత్నించినప్పుడు, దారి మధ్యలో ఆ ఏనుగు లారీ నుండి బయటికి దిగిపోయిందని, ఆ ఏనుగుకి గాయాలు అయ్యాయని చెప్తూ, ఒక వీడియోని ‘#BanPETA’ అనే హాష్‌ట్యాగ్ తో కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియోలో కంచి ఆలయ ఏనుగుని తరలించిడానికి ప్రయత్నిస్తున్న PETA సంస్థ.

ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్నది ‘కంచి కామకోటి పీఠం’ కి చెందిన ‘సంధ్య’ అనే ఏనుగు. ‘కంచి కామకోటి పీఠం’ అభ్యర్థన మేరకు ‘ట్రీ ఫౌండేషన్ ఇండియా’ మరియు ‘వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్’ వారు ఆ ఏనుగుని పునరావాస కేంద్రానికి బదిలీ చేస్తున్నప్పుడు 2016లో తీసిన వీడియో అది. PETA సంస్థకు, వీడియోలోని ఘటనకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని ఒక వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ట్వీట్ కి బదులిస్తూ, ట్వీట్ లో చెప్పింది ఫేక్ న్యూస్ అని, ఆ వీడియోలోని ఘటనకీ, తమ సంస్థకి ఎటువంటి సంబంధం లేదని PETA సంస్థ తెలిపింది. అయితే, వీడియోలోని ఘటన గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పై ట్వీట్ చేసిన వ్యక్తి జూన్ 2020 లో అదే వీడియో పెట్టి, ‘ఎన్జీఓ వారు సంధ్య ని కొన్ని సంవత్సరాల ముందు ఎలా తీసుకెళ్తున్నారో చూడండి’ అని చెప్తూ, మరికొన్ని వీడియోలు ఆ ట్వీట్ కింద పెట్టినట్టు చూడవొచ్చు.

కావున, కొన్ని సంబంధిత కీ-వర్డ్స్ తో వెతకగా, 2016 లో ‘కంచి కామకోటి పీఠం’ కి చెందిన మూడు ఏనుగులను పునరావాస కేంద్రానికి బదిలీ చేసారని చెప్తూ ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ దొరుకుతాయి. ‘ట్రీ ఫౌండేషన్’ వారు మూడు నెలల పాటు ఆ ఏనుగులకు వైద్య సహాయం అందిస్తారని ‘డెక్కన్ క్రానికల్’ ఆర్టికల్ లో చదవొచ్చు. ఆ ఆర్టికల్ లో వీడియోలోని ఘటన గురించి కూడా రాసి ఉన్నట్టు చదవొచ్చు – ‘ఏనుగులు తరలిస్తున్నప్పుడు సంధ్య అనే ఏనుగు ట్రక్కుపై నుంచి దూకింది’.

అంతేకాదు, ఆ మూడు ఏనుగులను ప్రైవేటు సంస్థల (‘ట్రీ ఫౌండేషన్ ఇండియా’ మరియు ‘వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్’) నుండి అటవీ శాఖ వారి ఏనుగుల రక్షణ మరియు పునరావాస కేంద్రానికి బదిలీ చేయాలని 2019 లో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఎక్కడా కూడా PETA సంస్థ గురించి లేదు. తమ దగ్గర ఏనుగుల పునరావాసం కోసం మౌలిక సదుపాయాలు లేనందున తాత్కాలిక కాలానికి ఏనుగులను బదిలీ చేయడానికి అటవీ అధికారుల నుండి అనుమతి కోరుతూ ‘కంచి కామకోటి పీఠం’ వారు రాసిన లేఖను హైకోర్టు తీర్పుకి సంబంధించిన డాక్యుమెంట్ లో చూడవొచ్చు.

మద్రాస్ హైకోర్టు తీర్పులో వీడియోలోని ఘటన గురించి పిటిషనర్ కోర్టుకి చెప్పిన వ్యాఖ్యలు చూడవొచ్చు – “ట్రీ ఫౌండేషన్ ఇండియా’ మరియు ‘వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్’ వారు ఏనుగులను ‘కంచి కామకోటి పీఠం’ నుండి తీసుకొని, వాటిని లారీలలో ఎక్కించారు. ఆ ప్రక్రియలో ‘సంధ్య’ అనే ఏనుగుకి గాయాలయ్యాయి’. కావున, వీడియోలోని ఘటనకీ, PETA సంస్థకి ఎటువంటి సంబంధంలేదు.

‘ట్రీ ఫౌండేషన్ ఇండియా’ వారి దగ్గర ఆ మూడు ఏనుగులు ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవొచ్చు.

వీడియో 2: (ఆర్కైవ్డ్)

మనక్కుల వినాయగర్ ఆలయానికి చెందిన ‘లక్ష్మీ’ అనే ఏనుగుని కూడా PETA సంస్థ వారు తీసుకుపోయి చెట్టుకు కట్టేసారని చెప్తూ ఇంకో వీడియోని కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఆ ఏనుగును తాము తీసుకొని వెళ్లలేదని, కానీ ప్రతి ఏనుగు చైన్లతో కాకుండా ఇతర జంతువులతో కలిసి ఉండాలని చెప్తూ PETA సంస్థ వారు ఒక ట్వీట్ కి బదులిచ్చారు. PETA సంస్థ వారు ఆ ఏనుగును విడిపించాలని అధికారులను ఇంతకముందు కోరినట్టు మరియు ఇప్పుడు కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ లీడర్ మనేకా గాంధీ ఫిర్యాదు మేరకు మనక్కుల వినాయగర్ ఆలయానికి చెందిన ‘లక్ష్మీ’ ని అటవీ శాఖ అధికారులు వేరే ప్రదేశానికి తరలించినట్టు న్యూస్ రిపోర్ట్స్ లో చదవొచ్చు. తరువాత, ఆ ఏనుగు ను తిరిగి ఆలయానికి తీసుకొని వచ్చినట్టు ఈ న్యూస్ ఆర్టికల్ లో చదవొచ్చు.

చివరగా, PETA సంస్థకు, వీడియోలోని కంచి ఆలయ ఏనుగు ఘటనకి ఎటువంటి సంబంధం లేదు. రెండో ఘటనలో కూడా PETA సంస్థ ఏనుగును తీసుకొని వెళ్లలేదు, కానీ వారు ఆ ఏనుగును విడిపించాలని మాత్రం అధికారులను  కోరుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll