Fact Check, Fake News, Telugu
 

ICICI, AXIS, HDFC బ్యాంకులు 1990ల్లో ఆర్ధిక సంస్కరణలు చేపట్టిన తర్వాత స్థాపించబడ్డ ప్రైవేటు రంగ బ్యాంకులు

0

ప్రభుత్వ సంస్థలుగా ఉన్న HDFC, AXIS మరియు ICICI బ్యాంకులను పి.వి. నరసింహా రావు ప్రభుత్వంలో  మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో HDFC, AXIS మరియు ICICI బ్యాంకులను ప్రైవేటీకరించారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో HDFC, AXIS మరియు ICICI బ్యాంకులను ప్రైవేటీకరించారు.

ఫాక్ట్ (నిజం): ఇందిరా గాంధీ 1969లో 14, 1980లో మరో 6 కమర్షియల్ బ్యాంకులను జాతీయం చేశారు. HDFC, AXIS మరియు ICICI బ్యాంకులు ఆ జాబితాలో లేవు. 1993లో పి.వి. నర్సింహారావు ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలు చేపట్టి  భారత బ్యాంకింగ్ రంగంలో కొత్త సరళీకరణ సంస్కరణలు అమలు చేసే క్రమంలో భాగంగా కొత్త ప్రైవేటు రంగ బ్యాంకులకు లైసెన్సులను అందించింది, HDFC, AXIS మరియు ICICI బ్యాంకులు అందులో భాగంగానే స్థాపించబడ్డాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

భారత దేశంలో మొదటి సారిగా 1969లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 14 కమర్షియల్ బ్యాంకులను జాతీయం చేసారు, మళ్ళీ 1980లో 6 బ్యాంకులను జాతీయం చేసారు. HDFC, AXIS లేదా ICICI బ్యాంకులు జాతీయం చేయబడ్డ 20 బ్యాంకులలో లేవు. ఐతే పి.వి. నరసింహా రావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నేపధ్యంలో బ్యాంకింగ్ రంగంలో కూడా సంస్కరణలు చేపడుతూ 1993లో ప్రైవేటు రంగంలో బ్యాంకులకు అనుమతిస్తూ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసారు. ఈ నేపధ్యంలో HDFC, AXIS మరియు ICICI బ్యాంకులతో పాటు మరికొన్ని ఇతర బ్యాంకులు లైసెన్స్లు పొందాయి. ఈ మూడు బ్యాంకుల ఆవిర్భావం గురించి కింద క్లుప్తంగా తెలుసుకుందాం.

ICICI బ్యాంకు:

ICICI బ్యాంకు 1955లో భారతీయ వ్యాపారాలకు మీడియం-టర్మ్ మరియు లాంగ్-టర్మ్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ చేసే ఉద్దేశంతో స్థాపించబడిన ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థ. 1990ల్లో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తరవాత అప్పటి వరకు కేవలం ప్రాజెక్ట్ లకు ఫైనాన్సు అందించే సంస్థగా ఉన్న ICICI సంస్థ, వివిధ ఆర్ధిక సేవలందించే ఉద్దేశంతో 1994లో ICICI బ్యాంకు స్థాపించింది. దీన్నిబట్టి ICICI అనేది 1990ల్లో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత స్థాపించబడ్డ ఒక ప్రైవేటు బ్యాంకని అర్ధం చేసుకోవచ్చు.

HDFC బ్యాంకు:

1990ల్లో ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలలో భాగంగా బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన కొన్ని ప్రైవేటు బ్యాంకులలో HDFC ఒకటి. HDFC 1994లో బ్యాంకింగ్ లైసెన్స్ పొందింది.

Axis బ్యాంకు:

Axis బ్యాంకుని 1990ల్లో పి.వి. నరసింహా రావు ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేటు బ్యాంకులకు లైసెన్స్ అందించడం మొదలు పెట్టిన తరవాత 1993లో స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ అఫ్ యూనిట్ ట్రస్ట్ అఫ్ ఇండియా (SUUTI), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క ప్రోత్సాహంతో స్థాపించబడ్డ ఒక ప్రైవేటు బ్యాంకు. ఈ బ్యాంకు 1994 తమ కార్యకలాపాలను ప్రారంభించింది, ఐతే అప్పుడు దీని పేరు UTI బ్యాంకుగా ఉండేది.

2003లో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని రద్దు చేసి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(UTI)ని స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ అఫ్ యూనిట్ ట్రస్ట్ అఫ్ ఇండియా (SUUTI) మరియు UTI మ్యూచువల్ ఫండ్ అనే రెండు సంస్థలుగా విభజించారు. తద్వారా UTI వద్ద ఉన్న Axis బ్యాంకు యొక్క షేర్లను SUUTIకి బదలాయించారు. ఐతే 2013-14లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో SUUTI వద్ద ఉన్న Axis బ్యాంకు యొక్క షేర్లలో 9% ప్రభుత్వ మైనారిటీ వాటాని విక్రయించారు. అలాగే 2018-19 & 2020-21 మోదీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మళ్ళీ 9.29% & 0.41% ప్రభుత్వ మైనారిటీ వాటాని విక్రయించారు. వీటన్నిబట్టి Axis బ్యాంకు అనేది 1990ల్లో ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలలో భాగంగా స్థాపించబడ్డ ఒక ప్రైవేటు బ్యాంకు అయినప్పటికీ, ఇందులో ఉన్న కొంత ప్రభుత్వ వాటాని మన్మోహన్ సింగ్ మరియు మోదీ ప్రధానులుగా ఉన్న సమయంలో విక్రయించారని అర్ధం చేసుకోవచ్చు.

ఒకవేళ పోస్టులో చెప్తున్నట్టు ICICI మరియు HDFC బ్యాంకులు ఇంతకు ముందు ప్రభుత్వ రంగ సంస్థలైతే, 1991లో మొదటి సారిగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ సంస్థల్లో విక్రయించిన వాటాలకి సంబంధించిన సమాచారంలో ఈ బ్యాంకులను ప్రైవేటీకరించిన సమాచారం కూడా ఉండేది, కాని వీటి గురించి అందులో ఎటువంటి ప్రస్తావన లేదు.

అంతే కాదు, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తమ 1992-93 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు సంస్థలకి అనుమతిచ్చిన తరవాత ప్రైవేటు బ్యాంకులు స్థాపించడానికి చాలా దరఖాస్తులు వచ్చాయని, ఐతే వీటిలో నుండి అప్పటి వరకు ఆర్ధిక సంస్థలైన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా – UTI (ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్), హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (HDFC) మరియు ఇండస్ట్రియల్ క్రెడిట్ & ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ICICI) లకు ప్రైవేట్ బ్యాంకులు నెలకొల్పేందుకు అనుమతిచ్చినట్టు పేర్కొంది.

చివరగా, ICICI, AXIS మరియు HDFC అనేవి 1990ల్లో ఆర్ధిక సంస్కరణకు చేపట్టిన తర్వాత స్థాపించబడ్డ ప్రైవేటు రంగ బ్యాంకులు.

Share.

About Author

Comments are closed.

scroll