Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక పథకం మొదలుపెట్టలేదు.

0

కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నదని, చికిత్స పొంది డిశ్చార్జి అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో పోస్టులో ఇచ్చిన లింక్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ ఒక లింక్ తో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, కోవిడ్-19 బారినపడి మృతి చెందిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని కూడా ఆ పోస్టులో రాసి ఉన్నట్టు చదవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం మొదలు పెట్టింది.      

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఇచ్చిన లింక్ ‘Journalists Welfare Scheme’ (జర్నలిస్టుల సంక్షేమ పథకం) కి సంబంధించినది. అది ఒక పాత పథకం; దాంట్లో కోవిడ్-19 కి సంబంధించిన వివరాలు లేవు. పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అధికారులను FACTLY సంప్రదించగా, కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి కొత్త పథకం మొదలు పెట్టలేదని  తెలిపారు. అయితే, పాత పథకం ‘Journalists Welfare Scheme’ ద్వారా కోవిడ్-19 తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకి మరియు కోవిడ్-19  చికిత్స ఖర్చు కొరకు ప్రధాన వ్యాధుల (‘major ailments’) కింద జర్నలిస్టులకు ఆర్ధిక సహాయం ఇచ్చే అవకాశం ఉందని, కానీ ఇప్పటివరకు దాని పై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కావున పోస్ట్ లో ప్రత్యేక పథకం ద్వారా జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం మరియు అందరు జర్నలిస్టులకి కోవిడ్-19 చికిత్సకి కూడా జర్నలిస్టుల సంక్షేమ పథకం వర్తిస్తుందని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్టులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగా, ‘Journalists Welfare Scheme’ (జర్నలిస్టుల సంక్షేమ పథకం) కి సంబంధించిన వెబ్ పేజీ వస్తుంది. దాంట్లో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కోవిడ్-19 గురించి రాసి లేదు.

ఆ పథకం గురించి మరిన్ని వివరాల కోసం వెతకగా, అది ఎప్పటినుండో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పథకానికి సంబంధించి 2013 లో రిలీజ్ చేసిన మార్గదర్శకాల డాక్యుమెంట్ ని ఇక్కడ చదవొచ్చు. తాజాగా, 2019 లో మార్గదర్శకాలు సవరిస్తూ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ని ఇక్కడ చూడవొచ్చు. ఆ పథకం గురించి చదవగా, ఒక జర్నలిస్ట్ చనిపోయి వారి కుటుంబం కష్టాల్లో ఉంటే లేదా శాశ్వత వైకల్యం వల్ల జర్నలిస్ట్ జీవనోపాధి కోల్పోతే ఐదు లక్షల రూపాయలు వరకు, ప్రధాన వ్యాధుల (‘major ailments’) చికిత్స ఖర్చు కొరకు (CGHS మరియు ఇతర డిపార్ట్మెంట్ భీమాలో కవర్ కాకుంటే) మూడు లక్షల రూపాయల వరకు, ఆక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో చేరితే (CGHS మరియు ఇతర డిపార్ట్మెంట్ భీమాలో కవర్ కాకుంటే) రెండు లక్షల రూపాయల వరకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం సహాయం చేస్తుందని తెలిసింది. అయితే, ఈ పథకం ద్వారా సహాయం పొందటానికి అందరు జర్నలిస్టులు అర్హులు కాదు. పీఐబీ అక్రిడిషన్‌ లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అక్రిడిషన్ లేని జర్నలిస్టులు కనీసం ఐదు సంవత్సరాలు పని చేసి ఉండాలి. అంతేకాదు, సహాయం పొందటానికి అక్రిడిషన్‌ లేని జర్నలిస్టులకు వివిధ కండిషన్లు ఉంటాయి. ప్రధాన వ్యాధుల (‘major ailments’) చికిత్స ఖర్చు కొరకు ఇచ్చే సహాయం 65 ఏళ్ళు పై బడిన అక్రిడిషన్‌ లేని జర్నలిస్టులకు ఇవ్వరు. ఆక్సిడెంట్ చికిత్స సహాయంలో అక్రిడిషన్‌ లేని జర్నలిస్టులకు ఎంత సహాయం ఇవ్వాలో అని నిర్ధారించడానికి కూడా కండిషన్లు ఉంటాయి. పూర్తి వివరాలు కింద ఫోటోలో చూడవొచ్చు.

పై డాక్యుమెంట్ ని 2019 లో రిలీజ్ చేసారు కాబట్టి కోవిడ్-19 కి సంబంధించిన వివరాలు లేవు. కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులు కూడా ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చా అని తెలుసుకోవటానికి పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అధికారులను FACTLY సంప్రదించగా, కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి కొత్త పథకం మొదలు పెట్టలేదని  తెలిపారు. అయితే, పాత పథకం ‘Journalists Welfare Scheme’ ద్వారా కోవిడ్-19 తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకి మరియు కోవిడ్-19  చికిత్స ఖర్చు కొరకు ప్రధాన వ్యాధుల (‘major ailments’) కింద జర్నలిస్టులకు ఆర్ధిక సహాయం ఇచ్చే అవకాశం ఉందని, కానీ ఇప్పటివరకు దాని పై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

అంతే కాదు, జర్నలిస్టుల సంక్షేమ పథకం కింద దరఖాస్తు చేసిన జర్నలిస్టులందరికీ సహాయం ఇవ్వరు. ఎవరికి ఇవ్వాలో అనేది ఒక కమిటీ నిర్ణయిస్తుంది.  పథకంలో ఇచ్చిన కండిషన్లలో ఎమన్నా మినహాయింపులు ఉన్నా వాటిని కమిటీ నిర్ణయిస్తుంది.

ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఈ పథకానికి కేటాయించిన మొత్తంలో నుండి జర్నలిస్టులకు సహాయం అందిస్తారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్ లో ఈ పథకం కోసం కోటి రూపాయలు కేటాయించినట్టు కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ కి సంబంధించిన ‘డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్’ డాక్యుమెంట్ లో చూడవొచ్చు

చివరగా, కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక పథకం మొదలుపెట్టలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll