గుండెపోటు వచ్చిన వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చేంత వరకు అల్లం నమలడం ద్వారా గుండెలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి రోగికి గుండెపోటు తగ్గుతుందని అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గుండెపోటు వచ్చిన వెంటనే అల్లం తినడం వల్ల గుండెపోటు తగ్గుతుంది.
ఫాక్ట్(నిజం): నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, వెబ్‌ఎమ్‌డి వెబ్‌సైట్‌లలో ప్రచురించబడిన పరిశోధన కథనాల ప్రకారం, అల్లం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే, గుండెపోటు వచ్చిన వెంటనే అల్లం తీసుకోవడం వల్ల గుండెపోటు తగ్గుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, గుండెపోటును మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ అని కూడా పిలుస్తారు, ఇది గుండె కండరాలకు తగినంత రక్తం లభించనప్పుడు సంభవిస్తుంది. అనేక అధ్యయనాల ప్రకారం కరోనరీ ఆర్టరీ సంకోచించడం వల్ల గుండెకు రక్త సరఫరా ఆగిపోయి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి చికిత్స పొందడంలో ఆలస్యం అయ్యేకొద్ది కండరాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది.
గుండెపోటు చికిత్సలో అల్లం ఉపయోగం, దాని ప్రభావం గురించి గల వైద్య పరిశోధన అధ్యయనాల కోసం వెతకగా, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన పరిశోధనా పత్రం లభించింది, దీని ప్రకారం “ఇటీవలి సంవత్సరాలలో, కొత్త ఔషధాలను తక్కువ దుష్ప్రభావాలతో అభివృద్ధి చేయడానికి అనేక మూలికా మందులు ఉపయోగించబడ్డాయి. మూలికా మందులలో అల్లం అనేక వ్యాధులలో సాంప్రదాయ ఔషధంగా చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతుంది, అల్లంలో గుండెకు మేలు చేసే కార్డియోప్రొటెక్టివ్ గుణాలు అనేకం ఉన్నాయి, అల్లం గుండె పనితీరు, రక్తపోటు, లిపిడ్ స్థాయిలు మరియు రక్తం గడ్డకట్టడం వంటి వివిధ అంశాలను ప్రభావితం చేయడం ద్వారా హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తుంది”.
అలాగే, WebMD ప్రకారం, అల్లం అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు వంటి వ్యాధులతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
అయితే, గుండెపోటు వచ్చిన వెంటనే అల్లం తీసుకోవడం వల్ల గుండెపోటు తగ్గుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేయో క్లీనిక్ క్రింది సూచనలు చేసింది.
- అంబులెన్స్ కోసం వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయాలి.
- ఎమర్జెన్సీ హెల్ప్ అందేలోగా ఆస్పిరిన్ ట్యాబెల్‌ను నమిలి మింగాలి. ఆస్పిరిన్ ట్యాబ్లెట్ రక్తం గడ్డకట్టకుండా ఉండటంలో సహకరిస్తుంది.
- హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఆస్పిరిన్ తీసుకుంటే గుండె దెబ్బతినడాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు ఏదైనా అలర్జీ వస్తుందని తెలిస్తే దాన్ని తీసుకోవద్దు.
- ఒక వేళ మీకు ఇంతకు ముందే నైట్రో-గ్లిజరిన్‌ను సూచిస్తే, ఎమర్జెన్సీ సాయం అందేలోగా నైట్రో గ్లిజరిన్ తీసుకోవచ్చు.
- గుండెపోటు వచ్చిన వ్యక్తి స్పృహలో లేకపోతే వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి.
గుండెపోటు చికిత్సలు మరియు మందుల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ పేజీని సందర్శించండి.
చివరగా, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అల్లం ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, గుండెపోటు వచ్చిన వెంటనే అల్లం తీసుకోవడం వల్ల గుండెపోటు తగ్గుతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.