Fake News, Telugu
 

సుడాన్‌లోని పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ ఈ రాళ్లు హిందూ దేవాలయానికి సంబంధించినవని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు

0

పచ్చి ఇస్లామిక్ దేశంలో ఒక హిందూ దేవాలయం బయటపడడం గొప్ప విశేషం. జయహో సనాతన ధర్మ.’ అని చెప్తూ, మూడు పెద్ద రాళ్లు, ఒక కట్టడం కలిగి ఉన్న ఫోటో ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా షేర్ చేస్తున్నారు. ఇది 2700 ఏళ్ల క్రితంది అని, పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించినట్లు ఈ పోస్టు ద్వారా చెప్తున్నారు. అసలు ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: సుడాన్ దేశంలో, పురావస్తు తవ్వకాల్లో 2700 ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటోలో కనిపిస్తున్న ఇసుక రాయి ఇటుకలు ఆమూన్ రా అనే దేవునికి గుడికి సంబంధించినవి. సుడాన్ దేశంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో  ఆమూన్ రా దేవాలయ శిధిలాలు, ఇసుకరాయి ఇటుకలు బయటపడ్డాయి. ఆమూన్ రా అనే దేవున్ని ఈజిప్ట్ దేశస్థులు మరియు కుష్ రాజ్యస్తులు 2700 ఏళ్ల క్రితం పూజించే వారు. పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ ఈ రాళ్ల గురించి ప్రచురితమైన ఏ వార్తా కథనాల్లో కూడా ఇది హిందూ దేవాలయం అని పేర్కొనలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ పోస్టులో ఉన్న ఫోటోను ఇంటర్నెట్లో  రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఆ ఫోటో కలిగిన అనేక వార్త కథనాలు లభించాయి. లైవ్ సైన్స్ వారి కథనం ప్రకారం సుడాన్ దేశంలో పురావస్తు తవ్వకాల్లో కొన్ని ఇసుకరాయి ఇటుకలు బయటపడ్డాయి. వీటి పైన hieroglyphic శాసనాలు ఉన్నట్లు, ఇవి 2700 సంవత్సరాల క్రితం కుష్ రాజ్యం కాలం నాటివని, ఈ ఇటులకు ఆ కాలం నాటి ఒక దేవాలయానికి సంబంధించినవని ఆ కథనంలో లైవ్ సైన్స్ పేర్కొనింది.

ఈ దేవాలయం యొక్క శిథిలాల్లో ఉన్న శాసనాలని బట్టి ఇది ఆమూన్ రా అనే ఈజిప్షియన్  దేవునికి సంబంధించినది అని డేవిడ్ వైకేజోరెక్ అనే ఆర్కియోలాజిస్ట్ లైవ్ సైన్సుకి తెలియచేసారు.

తవ్వకాల్లో బయటపడ్డ ఇటురాళ్ల గురించి రాయబడ్డ ఏ వార్త కథనంలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) కూడా ఇది హిందూ దేవాలయం అని చెప్పలేదు. వైరల్ పోస్టులో తప్పుగా ఇది హిందూ దేవాలయం అని చెప్తున్నారు.

చివరిగా, సుడాన్‌లోని పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ ఈ రాళ్లు హిందూ దేవాలయానికి సంబంధించినవని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll