Fake News, Telugu
 

ఈ ఫోటో అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానిది కాదు.

0

నిర్మాణంలో ఉన్న ఒక కట్టడం ఫోటోని చూపిస్తూ, ఆ ఫోటోలో ఉన్న కట్టడం అయోధ్య లోని రామ మందిరం అనే అర్ధం వచ్చేలా ‘అయోధ్యలో రామ మందిరం పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్యలో కడుతున్న రామ మందిరం ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ్ ఆలయానికి సంబంధించినది. ఈ ఫొటోకి, అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో ఉత్తరప్రదేశ్ లోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సుందరీకరించేందుకు మొదలుపెట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న ఆలయం యొక్క మెయిన్ కాంప్లెక్స్ కి సంబంధించింది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్న మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర’ ట్రస్ట్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో 09 అక్టోబర్ 2020న మందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసారు. వాటిని ఇక్కడ చూడొచ్చు.

అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి సంబంధించి రామ మందిరం కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ అయిన న్రిపెంద్ర మిశ్ర 31 అక్టోబర్ 2020 న మీడియాతో మాట్లాడుతూ తాము మందిరం యొక్క పిల్లర్స్ కి సంబంధించి IIT చెన్నై ఇవ్వవలసిన రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. దీన్నిబట్టి నిర్మాణం ఇంకా మొదటి దశలోనే ఉందని చెప్పొచ్చు.

చివరగా, పోస్టులో ఉన్న ఫోటో కాశీ విశ్వనాథ్ ఆలయానికి సంబంధించినది; అయోధ్య రామ మందిరానికి సంబంధించినది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll