Fact Check, Fake News, Telugu
 

ఛత్రపతి శివాజీ హిందూ మతం, కుల వ్యవస్థలపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు లేవు

0

“నేను శూద్రుడనని బ్రాహ్మణాలు నాకు పట్టాభిషేకం చేయకపోవడం నన్ను కలచివేసింది. ఈ దినం హిందూ వ్యవస్థలో పుట్టినందుకు నేను సిగ్గు పడుతున్నాను. హిందూ మతంలో కుల వ్యవస్థ కొనసాగితే హిందూ మతం అంతమవడం ఖాయం.” అని ఛత్రపతి శివాజీ అన్నట్లుగా చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అలాగే ఒక బ్రాహ్మణుడు శివాజీకి తన కాలితో తిలకం దిద్దినట్లు కూడా ఈ పోస్టులో పేర్కొన్నారు.

క్లెయిమ్: ఒక బ్రాహ్మణుడు తన కాలితో శివాజీకి తిలకం దిద్దాడు. తనని బ్రాహ్మణులు అవమానించిన కారణంగా ఛత్రపతి శివాజీ హిందూ మతంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు.

ఫాక్ట్: క్షత్రియ కులంలో పుట్టక పోవడం వలన అక్కడి బ్రాహ్మణులు శివాజీకి అప్పటి ఆచారాల ప్రకారం రాజుగా పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారని చాలా మంది చరిత్రకారులు రాసారు. అయితే, శివాజీ బెనారస్‌కి చెందిన గాగ భట్టా అనే పండితుడిని పిలిపించాడు. ఆయన శివాజీని క్షత్రియుడిగా ప్రకటించి, 1674 లో పట్టాభిషేకం జరిపించాడు. అయితే, గాగ భట్టా తన కాళ్లతో శివాజీ నుదిటిపై తిలకం పెట్టాడని కూడా ఎక్కడా కూడా చరిత్రకారులు పేర్కొనలేదు. అంతే కాదు, తనకి జరిగిన అవమానాలకు బదులుగా హిందూ మతం పైనా, కుల వ్యవస్థ పైనా శివాజీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

ముందుగా, శివాజీ జీవిత చరిత్రను తెలియజేసే పుస్తకాలను (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) పరిశీలించగా, ఛత్రపతి శివాజీ మరాఠా సామాజిక వర్గానికి చెందిన కుంబి కులంలోని భోంస్లే కుటుంబానికి చెందిన వాడిగా పేర్కొన్నారు. ఈ విషయంపై Factly ఇదివరకే ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

తనని తాను క్షత్రియుడిగా శివాజీ తండ్రి షాహాజీ ప్రకటించుకున్నట్లు తెలుస్తుంది. అయితే, శివాజీ కుటుంబ చరిత్రలో స్పష్టత లేకపోవడంతో అతను క్షత్రియుడా లేక శూద్రుడా అనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి.

ఇక, అప్పటి ఆచారాల ప్రకారం, ఒక క్షత్రియుడు మాత్రమే రాజ్యాధికారానికి అర్హుడవుతాడని, ఈ కారణం వల్లనే రాజ్యంలోని బ్రాహ్మణులు శివాజీని రాజుగా పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారని చరిత్రకారులు రాసారు.

అయితే, బెనారస్‌కు (నేటి వారణాసి) చెందిన గాగ భట్టా అనే పండితుడిని పిలిపించగా, ఆయన శివాజీని క్షత్రియుడిగా ప్రకటించి 1674లో పట్టాభిషేకం జరిపించాడు. కానీ, ఈ సందర్భంలో శివాజీ నుదిటిపై గాగ భట్టా తన కాలితో తిలకం దిద్దినట్లు కచ్చితమైన ఆధారాలు దొరకలేదు. కేవలం కాళ్ళు మొక్కి ఆరశీర్వాదం తీసుకున్నట్లు వివరించారు.

అయితే, శూద్రుడు అనే కారణం చేత పట్టాభిషేకం చేయకుండా బ్రాహ్మణులు వివక్ష చూపించారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అంబేద్కర్ కూడా తన రచనలలో ప్రస్తావించారు. కానీ,  అందుకు బదులుగా శివాజీ హిందూ మతం పైన మరియు కుల వ్యవస్థ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు రుజువులు లేవు.

చివరిగా, బ్రాహ్మణుల నుంచి తనకు ఎదురైన అవమానాలకు బదులుగా హిందూమతం మరియు అందులోని కుల వ్యవస్థ గురించి శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll