‘మహారాష్ట్రలోని నాగపూర్ లో పండించిన క్యాబేజీలో ఒక ప్రమాదకర విష పురుగుని గుర్తించారని, ఈ పురుగుని ఎన్ని సార్లు కోసినా అవి చావకుండా తిరిగి పురుగులుగా మారిపోతున్నాయని’ చెపుతున్న వీడియో గురించి వివరణ కోరుతూ మా వాట్సాప్ టిప్ లైన్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇదే వీడియో కొన్ని సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోలో చెప్తున్నదాంట్లో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మహారాష్ట్రలోని నాగపూర్ లో పండించిన క్యాబేజీలో ఒక ప్రమాదకర విష పురుగుని గుర్తించారు.
ఫాక్ట్ (నిజం): క్యాబేజీలో ఒక ప్రత్యేక సన్నని విష పురుగును గుర్తించినట్టు ఎటువంటి సమాచారం లేదు. సాధారణంగా క్యాబేజీ లేదా ఇతర కూరగయలు టేప్‌వార్మ్ వంటి పారాసైట్స్ భారిన పడుతుంటాయి. ఇలా పారాసైట్స్ భారిన పడిన కూరగాయలను సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల అవి మనిషి శరీరంలోకి ప్రవేశించి, కాలేయం, మెదడు మొదలైన భాగాలలో తిత్తులు తయారు చేస్తాయని తెలిసింది. ఐతే నిపుణులు చెప్పిన దాని ప్రకారం మందులు వాడడం వల్ల ఇవి తగ్గిపోతాయని కూడా తెలిసింది. కాకపోతే బాగా ఉడికిన మాంసం తినడం, తినడానికి ముందు పండ్లు మరియు కూరగాయలను బాగా కడగడం వంటివి పాటించాలి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
క్యాబేజీలో ఒక ప్రత్యేక సన్నని విషపురుగును గుర్తించినట్టు, ఇవి చాలా ప్రమాదకరమైనవని తెలుపుతూ ఎటువంటి వార్త కథనాలు గాని లేక వ్యవసాయ శాస్త్రవేత్తల రీసెర్చ్ పేపర్స్ గాని మాకు లభించలేదు. ఐతే ఇంతకు ముందు కూడా ఇలానే క్యాబేజీ తినడం వల్ల మెదడులో ప్రాణాంతకమైన మెదడు టేప్‌వార్మ్‌లు ఏర్పడతాయన్న వార్త వైరల్ అయినప్పుడు BBC దినిపై ఒక కథనం ప్రచురించింది. ఈ కథనంలో డాక్టర్ గుప్తా చెప్పిన దాని ప్రకారం సాధారణంగా కూరగాయలలో టేప్‌వార్మ్, పిన్‌వార్మ్స్, థ్రెడ్‌వార్మ్ మరియు రౌండ్‌వార్మ్స్ వంటి పురుగుల భారిన పడుతుంటాయి. సాధారణంగా టేప్‌వార్మ్ లార్వా సరిగ్గా ఉడకని పంది మాంసం, చేపలు, క్యాబేజీ లేదా ఆకు కూరలను తినడం వల్ల మనుషులలోకి ప్రవేశిస్తుంది. ముందుగా ఇలాంటివి తినడం వల్ల టేప్‌వార్మ్ కడుపులోకి ప్రవేశించి ఆ తర్వాత రక్త ప్రవాహంతో మనిషి శరీరంలోని వివిధ భాగాలకు చేరతాయి. ఈ టేప్‌వార్మ్ కాలేయం, మెదడు మొదలైన భాగాలలో తిత్తులు తయారు చేస్తాయని, ఐతే మందులు వాడడం వల్ల ఇవి తగ్గిపోతాయని ఈ కథనంలో తెలిపారు. బాగా ఉడకని మాంసం తినకపోవడం, తినడానికి ముందు పండ్లు మరియు కూరగాయలను బాగా కడగడం వంటివి పాటించాలని తెలిపారు.
ట్రిబ్యూన్ ఇండియా కూడా ఈ విషయానికి సంబంధించి నిపుణులను సంప్రదించి ఒక కథనం రాసింది. ఈ కథనంలో దయానంద్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ నిపుణులు క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రాణాంతకమైన మెదడు టేప్‌వార్మ్‌లను క్యాబేజీతో అనుసంధానించలేదని స్పష్టం చేశారు. మెదడు టేప్‌వార్మ్‌లకు ముఖ్య కారణం పారిశుధ్యం అని తెలిపారు. ప్రొఫెసర్ గగన్‌దీప్ సింగ్ తెలిపిన దాని ప్రకారం కొన్ని సందర్భాల్లో, అప్పటికే టేప్‌వార్మ్‌ల బారిన పడిన వారు తమ మానవ వ్యర్థాలను తగిన విధంగా పారవేయరు. ఆపై పందులు వ్యర్థాలను తిని వ్యాధి బారిన పడతాయని, ఆ వ్యాధి భారిన పడిన పంది మాంసం తినడం వల్ల మనుషులకు సోకుతుందన్నారు.
పైగా ప్రొఫెసర్ గగన్‌దీప్ సింగ్ ఈ కథనంలో తెలిపిన దాని ప్రకారం ఈ వ్యాధి మనుషులకు సోకినప్పుడు కూడా పరిస్థితి విషమంగా ఏమి ఉండదని, మందులతో నయమైపోతుందని తెలిపారు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే సర్జరీ చేస్తారని తెలిపారు. కూరగాయలను తినే ముందు ఎప్పుడూ కడగడం వల్ల సురక్షితంగా ఉండొచ్చని తెలిపారు. అమెరికాకి చెందిన సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ కూడా మనుషులలో టేప్‌వార్మ్‌ల వల్ల సిస్ట్ లకి కలుషితమైన ఆహరం, పంది మాంసం మొదలైన కారణాలు తెలిపిందే కాని క్యాబేజీ లేదా ఇతర కూరగాయలు తినడం వల్ల ఇలా జరుగుతుందని ఎక్కడ కూడా చెప్పలేదు.
చివరగా, క్యాబేజీలో ఎటువంటి ప్రమాదకరమైన పురుగును గుర్తించలేదు.