Fake News, Telugu
 

బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి NHRC ఇలా వ్యాఖ్యానించలేదు

0

బెంగాల్ ఎన్నికల అనంతరం 15 వేల హింసాత్మక సంఘటనలు జరిగాయి అని, 7 వేల మంది మహిళలపై అత్యాచారం జరిగింది అని, సుమారు 25 మందిని చంపేసారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అన్నట్టు ఒక సోషల్ మీడియా పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి NHRC చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్: ఈ వ్యాఖ్యలు ‘కాల్ ఫర్ జస్టిస్’ సంస్థ యొక్క నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదిక ద్వారా వెల్లడించింది, NHRC కాదు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన తరువాత NHRC కమిటీ తమ నివేదికను కలకత్తా హై కోర్టుకు 30 జూన్ 2021న సమర్పించింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ వెతికినప్పుడు, ఒక న్యూస్ ఆర్టికల్ లో బెంగాల్ ఎన్నికల అనంతరం 15 వేల హింసాత్మక సంఘటనలు జరిగాయి అని, 7 వేల మంది మహిళలపై అత్యాచారం జరిగింది అని, సుమారు 25 మందిని చంపేసారని కాల్ ఫర్ జస్టిస్ సంస్థ యొక్క ‘నిజ నిర్ధారణ కమిటీ’ వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈ కమిటీ సిక్కిం హై కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లి అధ్యక్షతన ఏర్పడింది. తమ నివేదికను 29 జూన్ 2021న హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఐదుగురు సభ్యులు సమర్పించినట్టు ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ నివేదికను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామని అని కేంద్రం చెప్పినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆర్టికల్స్ లో ఎక్కడ గాని NHRC ప్రస్తావన లేదు. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా కాదు.

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని NHRC ఏర్పాటు చేసింది అని 21 జూన్ 2021 లో పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. ఆదివారం 27 జూన్ నుండి NHRC వారు బాధితులను కలిసి వివరాలు సేకరించినట్టు ఈ ఆర్టికల్ మరియు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. NHRC కమిటీ తమ నివేదికను కలకత్తా హై కోర్టుకు 30 జూన్ 2021 న సమర్పించినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల తరువాత హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ గొడవల్లో మరణించిన వారిలో త్రిణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. బెంగాల్ లోని జాదవ్ పూర్ ప్రాంతాన్ని సందర్శించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులపై కూడా దాడి జరిగింది అని న్యూస్ ఆర్టికల్స్ లో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఏఎన్ఐ వారి ట్విట్టర్ పోస్ట్ కూడా చూడొచ్చు.

NHRC తరచు ఇటువంటి సంఘటనలకు సంబంధించి, ఎక్కడ అయితే మానవ హక్కులు ఉల్లంగించబడతాయో అక్కడ కమిటీలను పంపి నివేదిక తయారుచేస్తుంది; మొన్న ఢిల్లీ లో జరిగిన హింసకు సంబంధించి ఒక ఫాక్ట్ ఫైండింగ్ టీం ను ఏర్పాటు చేసినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ 12 అక్టోబరు 1993న  మానవ హక్కుల పరిరక్షణ చట్టం (పిహెచ్ ఆర్ ఎ), 1993, మానవ హక్కుల పరిరక్షణ (సవరణ) చట్టం, 2006 ద్వారా స్థాపించబడింది; దాని యొక్క విధులకు సంబంధించి వెబ్ సైట్ లో ఇక్కడ చూడొచ్చు.

చివరగా, బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇలా వ్యాఖ్యానించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll