Coronavirus Telugu, Fake News, Telugu
 

గంగా నదిలో కరోనా మృతదేహాలను పడేస్తున్నందుకు నవీద్ ఆలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారన్నది ఒక కల్పిత వార్త

0

ఇటీవల ఉత్తరప్రదేశ్ లో గంగా నది లో అనేక మృతదేహాలు ప్రవహిస్తూ కనపడడంతో అవి కరోనా మృతదేహాలు అయ్యుండే అవకాశం ఉందని అనేక వార్తా కథనాలు ప్రచురింపబడ్డాయి. ఐతే ఈ నేపథ్యంలో, ‘యోగీజీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్రతో గంగా తీరంలో పాతిపెట్టిన శవాలను తవ్వితీసి గంగానది లో వదిలేసిన నవీద్ అలాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. అతనికి ఎవరెవరు సహాయం చేశారో ఈ కుట్రలో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉందో విచారణ చేస్తున్న యూపీ పోలీసులు’ అని చెప్తూ ఈ వాదనకు మద్దతుగా కొన్ని వార్తా కథనాల క్లిప్పింగ్స్ మరియు ఒక ట్వీట్ స్క్రీన్ షాట్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘యోగీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్రతో గంగా తీరంలో పాతిపెట్టిన శవాలను తవ్వితీసి గంగానది లో వదిలేసిన నవీద్ అలాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు’

ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను నవీద్ ఆలం అనే అంబులెన్స్ డ్రైవర్ పడేస్తునట్టు గానీ, ఈ కారణంతో అతనిని ఉత్తప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగాని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు లేవు. ఇది కేవలం ఒక కల్పిత వార్త మాత్రమే. టెలిగ్రాఫ్ కథనం కూడా కేవలం బీహార్ లో కోవిడ్ తో మరణించిన వారి మృతదేహాలను కొందరు అంబులెన్స్ సిబ్బంది గంగా నదిలో పడేస్తున్నారని’ బీహార్ రాష్ట్రానికి చెందిన BJP ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ చేసిన ఆరోపణల గురించి మాత్రమే ప్రస్తావించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను నవీద్ ఆలం అనే అంబులెన్స్ డ్రైవర్ పడేస్తునట్టు గాని, ఈ కారణంతో అతనిని ఉత్తప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగాని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు ఏవీ లేవు. అంతే కాదు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి కూడా ఈ విషయానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.

ఐతే పోస్టులో తమ వాదనకి మద్దతుగా ది టెలిగ్రాఫ్ వార్తా కథనం క్లిప్పింగ్ ని షేర్ చేసారు. ఐతే ఈ కథనంలో కేవలం బీహార్ లో  ‘కోవిడ్ తో మరణించిన వారి మృతదేహాలను కొందరు అంబులెన్స్ సిబ్బంది గంగా నదిలో పడేస్తున్నారని’ బీహార్ రాష్ట్రానికి చెందిన BJP ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ చేసిన ఆరోపణల గురించి మాత్రమే ప్రస్తావించారు. పైగా ఈ కథనంలో ఎక్కడ కూడా అంబులెన్స్ సిబ్బంది పేరు ప్రస్తావించలేదు.

బీహార్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ – బీహార్ బోర్డర్ సమీపంలోని జై ప్రభ బ్రిడ్జిపైనుండి అంబులెన్స్ సిబ్బంది కోవిడ్ మృతదేహాలను గంగా నదిలోకి విసిరేస్తున్న ఆరోపణలకు సంబంధించిన NDTV రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ రిపోర్ట్ లో బీహార్ BJP ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ మాట్లాడుతూ ఈ విషయంపై విచారణ జరగాలని కోరడం చూడొచ్చు. ఐతే ఈ కథనంలో కూడా ఎక్కడ అంబులెన్స్ సిబ్బంది పేర్లు ప్రస్తావించలేదు.

ఇక పోస్టులో షేర్ చేసిన హిందీ వార్తా కథనం కేవలం నేపాల్ నుండి ప్రవహించే గండక్ నది ద్వారా కరోనా మృతదేహాలు ఉత్తరప్రదేశ్- బీహార్ బోర్డర్ లో గంగా నదిలోకి కొట్టుకోస్తున్నాయని మాత్రమే రిపోర్ట్ చేసింది. అంతేగాని ఉత్తరప్రదేశ్ లో అంబులెన్సు సిబ్బంది కరోనా మృతదేహాలను గంగా నదిలోకి విసిరేస్తున్నట్టు ఈ కథనంలో ఎక్కడా పేర్కొనలేదు. ఐతే ఈ వార్త గురించి గూగుల్ లో వెతకగా నేపాల్ నుండి ప్రవహించే గండక్ నది ద్వారా మృతదేహాలు కొట్టుకు రావట్లేదని చెప్పే ఒక వార్తా కథనం మాకు కనిపించింది, పైగా ఈ కథనంలో ఉత్తరప్రదేశ్ లోని ఖడ్డ నియోజికవర్గ BJP MLA జటాశంకర్ త్రిపాఠి ఉత్తరప్రదేశ్- బీహార్ బోర్డర్ లో గండక్ నది ప్రాంతంలో అధికారులతో తనిఖీ చేసినప్పుడు గండక్ నది నుండి మృతదేహాలు కొట్టుకోస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అలాగే పోస్టులో తమ వాదనకు మద్దతుగా ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ని షేర్ చేసారు. ఐతే ఆ వ్యక్తి ప్రస్తుతం ఆ ట్వీట్ ని డిలీట్ చేసారు. ఆ అకౌంట్ లో ఇప్పుడు ఆ ట్వీట్ లేదు. వీటన్నిటి ఆధారంగా ఉత్తరప్రదేశ్ లో  నవీద్ ఆలం అనే వ్యక్తి గంగా నదిలో కరోనా మృతదేహాలు విసిరేస్తున్నాడన్న వార్త కేవలం కల్పితం అని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కరోనా మృతదేహాలను పడేస్తున్నందుకు నవీద్ ఆలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారన్నది కేవలం ఒక కల్పిత వార్త మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll