కడప జిల్లాలో జరిగిన తవ్వకాలలో అతిపెద్ద పురాతన నంది విగ్రహం బయటపడిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కడప జిల్లా తవ్వకాలలో బయటపడ్డ పురాతన నంది విగ్రహం యొక్క ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్న పురాతన నంది విగ్రహం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగర సమీపంలో బయటపడింది. 2019లో మైసూరు జిల్లాలోని అరసానికేరే గ్రామంలో ఈ నంది విగ్రహం బయటపడింది. ఈ పురాతన నంది విగ్రహం కడప జిల్లా తవ్వకాలలో బయటపడింది కాదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, పోస్టులో షేర్ చేసిన అదే నంది విగ్రహం ఫోటోని షేర్ చేస్తూ ‘The Hindu’ న్యూస్ వెబ్సైటు 15 జూలై 2019 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ పురాతన నంది విగ్రహం కర్ణాటక రాష్ట్రం మైసూరు నగర సమీపంలోని అరసానికేరే గ్రామంలో బయటపడినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. అరసానికేరే గ్రామస్తులు జరిపిన తవ్వకాలలో రెండు పురాతన నంది విగ్రహాలు బయటపడినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ నంది విగ్రహాలని విశ్లేషించిన పురావస్తు శాఖ అధికారులు, ఈ విగ్రహాలని 16 లేదా 17వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పరిపాలన తరువాత నిర్మించి ఉంటారని నిర్ధారించినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు .
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా తవ్వకాలలో బయటపడిన ఈ నంది విగ్రహాన్ని చూపిస్తూ ఒక యాత్రికుడు తన యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోని పోస్ట్ చేసారు. అరసానికేరే గ్రామంలో బయటపడ్డ నంది విగ్రహాల గురించి రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలలో కనిపిస్తున్న నంది విగ్రహం కర్ణాటక రాష్ట్రంలో బయటపడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ఈ ఫోటోలలో కనిపిస్తున్న పురాతన నంది విగ్రహం కర్ణాటక రాష్ట్రంలో బయటపడింది, కడప జిల్లా తవ్వకాలలో బయటపడినది కాదు.