భారత దేశంలో ముస్లింలు వివిధ రంగాలలో ఎంత శాతం మంది ఉన్నారో చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పడు చూద్దాం.
క్లెయిమ్: దేశ జనాభాలో ముస్లింలు 30%, జైళ్ళలో వీరు 32%, నేరాలలో వాటా 44%, పన్ను కట్టే వారు 3%.
ఫాక్ట్: 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు ‘14.2%’. 2022 NCRB నివేదిక ప్రకారం, మొత్తం జైళ్ళలో ఉన్న వారిలో ముస్లింలు 18.7%. చివరిగా 2013లో విడుదల అయిన లెక్కల ప్రకారం, దేశoలోని పోలీసులలో ముస్లింలు 6.27%. ఇక నేరాల లెక్కలు మరియు పన్ను వివరాలను మతం ఆధారంగా అధికారికంగా ప్రభుత్వం ఎక్కడా విడుదల చేయలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు ‘14.2%’ గా ఉంది. 2021 సెన్సస్ ఇంకా మొదలుకాలేదు.
‘నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో’ నివేదిక ప్రకారం 31 డిసెంబర్ 2021 నాటికి దేశంలోని జైళ్ళలో ఉన్న నేరస్థుల (convicts) సంఖ్య 1,22,852. ఇందులో ముస్లింలు సంఖ్య 19,580, అనగా 15.93%. మొత్తం ముద్దాయిల (undertrials) సంఖ్య 4,27,165గా ఉండగా, ఇందులో ముస్లింలు 17.99%. మొత్తంగా, 5,22,042 మంది (మతం ప్రకారం లెక్కలు ఇవ్వని మహారాష్ట్రని మినహాయించి) ఖైదీలు ఉంటే అందులో 97,650 మంది, అనగా 18.7% ముస్లింలు ఉన్నారు. జైళ్ళలో ముద్దాయిలుగా ఉన్న వివిధ మతాలకు చెందిన వారిని విశ్లేషిస్తూ రాసిన వ్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఇక దేశంలోని వివిధ పోలీసు డిపార్ట్‌మెంట్లలో పని చేస్తున్న సిబ్బంది వివరాలను చెప్పే ‘Data on Police Organizations’ వారు విడుదల చేసిన 2020 రిపోర్ట్లో కూడా మతం ఆధారంగా పోలీసులని లెక్కించలేదు. చివరిగా, 2013లో NCRB వారి లెక్కల ప్రకారం దేశంలో ఉన్న పోలీసుల సంఖ్యలో ముస్లింల వాటా 6.27% గా ఉంది. ఇక నేరాల విషయానికి వస్తే, NCRB వారు విడుదల చేసే నివేదికలలో ఎక్కడా కూడా నేరాల వివరాలను మతం ఆధారంగా విభజించలేదు. మరియు ‘డైరెక్ట్ టాక్స్ కలెక్షన్’, ‘ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ స్టాటిస్టిక్స్’, మరియు ‘GST’ వివరాలు లెక్కించే పద్దతి మతం ఆధారంగా ఉండదు . వీటికి సంబంధించి ఇదివరకే మేము రాసిన ఆర్టికల్ ను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ముస్లింల జనాభా 14.2% మరియు 2022 NCRB నివేదిక ప్రకారం దేశంలో అనేక కారణాల రీత్యా జైళ్ళలో ఉన్న ఖైదీలలో ముస్లింలు 18.7%.