Fake News, Telugu
 

యోగి ఆదిత్యనాథ్ గురుంచి ఈ పోస్టులో చెప్తున్న సమాచారమంతా వాస్తవం కాదు

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. యోగి ఆదిత్యనాథ్ విద్యాభ్యాసం, భారత ఆర్మీ గోర్ఖా రెజిమెంట్‌కు తనకీ ఉన్న అనుబంధం, యోగి ఆదిత్యనాథ్ భారత ప్రధాని అయితే నేపాల్ భారత దేశంలో విలీనమవుతుందని నేపాల్ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించడం, యోగి ఆదిత్యనాథ్ దినచర్య, అలవాట్లు మొదలగు విషయాలని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ విద్యాభ్యాసం, అలవాట్లు, భారత ఆర్మీతో అతనికి ఉన్న అనుబంధం, నేపాల్ పత్రికలు యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ప్రచురించిన కథనాల వివరాలను తెలుపుతూ పెట్టిన పోస్ట్.  

ఫాక్ట్ (నిజం): యోగి ఆదిత్యనాథ్ భారత ఆర్మీ గోర్ఖా రెజిమెంట్ కి ఆధ్యాత్మిక గురువు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. యోగి ఆదిత్యనాథ్ భారత ప్రధాని అయితే, నేపాల్ భారత్‌లో కలిసిపోతుందని నేపాల్ వార్తా సంస్థలు రిపోర్ట్ చేయలేదు. యోగి ఆదిత్యనాథ్ దినచర్య, అలవాట్ల గురించి తెలిపిన కొన్ని విషయాలు నిజమే అయినప్పటికీ, ఈ పోస్టులో యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి చాలా వరకు సమాచారం వాస్తవ దూరం.. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది .

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, 05 జూన్ 1972 నాడు ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మసల్గావ్ గ్రామంలో జన్మించిన యోగి ఆదిత్యనాథ్ (అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిష్ట్), హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ విశ్వవిద్యాలయంలో BSC పూర్తి చేసినట్టు తెలిసింది. యోగి ఆదిత్యనాథ్ గురించి HNB అధ్యాపకులు ప్రస్తావిస్తూ, యోగి ఒక నిబద్దతతో పనిచేసే వ్యక్తని, మంచి నాయకుడిగా ఎదిగే లక్షణాలు అతనిలో విద్యార్ధి దశ నుండే ఉండేవని తెలిపారు. కాని, యోగి ఆదిత్యనాథ్ BSC గణిత శాస్త్రంలో గోల్డ్ మెడల్ విధ్యార్దని వారు ఎక్కడా చెప్పలేదు. భారత ఆర్మీ రెజిమెంట్ కి ఆధ్యాత్మిక గురువు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. యోగి ఆదిత్యనాథ్ జీవిత చరిత్రను తెలుపుతూ పబ్లిష్ చేసిన ‘The Monk Who Became Chief Minister he Monk Who Became Chief Minister’ పుస్తకంలో కూడా యోగి ఆదిత్యనాథ్ గోర్ఖా రెజిమెంట్ అనుబంధం గురుంచి ఎక్కడా తెలుపలేదు.

18 మే 2006 నాడు నేపాల్ దేశాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించిన రోజుని యోగి ఆదిత్యనాథ్ పలు సార్లు ‘బ్లాక్ డే’గా ప్రస్తావించాడు. నేపాల్ దేశాన్ని తిరిగి హిందూ దేశంగా గుర్తించాలని యోగి ఆదిత్యనాథ్ 2015లో అప్పటి నేపాల్ ప్రధానికి లేఖ కూడా రాసారు. నేపాల్‌ని హిందూ రిపబ్లిక్ దేశంగా గుర్తించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయం చేయాలని నేపాల్ మాజీ డిప్యూటీ ప్రధాని బహిరంగ ప్రకటన చేసారు. కానీ, యోగి ఆదిత్యనాథ్ భారత ప్రధాని అయితే నేపాల్ భారత వశమవుతుందని నేపాల్ వార్తా సంస్థలు రిపోర్ట్ చేయలేదు.

యోగి ఆదిత్యనాథ్ ఖాళీ సమయాలలో బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ ఆటలాడే అలవాటు ఉన్నట్లు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కాని, యోగి ఆదిత్యనాథ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడని ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు. ‘The Monk Who Became Chief Minister he Monk Who Became Chief Minister’ పుస్తకంలో యోగి ఆదిత్యనాథ్ రోజు మూడు గంటలకు లేచి యోగా వ్యాయామం చేస్తారని తెలిపారు. ఆదిత్యనాథ్ రోజుకి 18 నుండి 20 గంటలు పనిచేస్తారని, చాలా తక్కువగా తింటారని ఈ పుస్తకంలో తెలిపారు. అలాగే, యోగి ఆదిత్యనాథ్‌కు ప్రకృతి అన్నా, వన్యప్రాణులు అన్నా చాలా ఇష్టమని, వారి సంరక్షణను అప్పుడప్పుడు తానే స్వయంగా చూసుకుంటారని ఈ పుస్తకంలో తెలిపారు. అయితే, వన్యప్రాణుల శిక్షణలో యోగి ఆదిత్యనాథ్ ఆసియాలోనే అత్యుత్తమ శిక్షకుడని గుర్తించినట్టు కూడా ఈ పుస్తకంలో గానీ, వేరే ఎక్కడా గానీ సమాచారం దొరకలేదు.

చివరగా, యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ఈ పోస్టులో చాలా వరకు అవాస్తవ సమాచారం షేర్ చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll