Fake News, Telugu
 

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏదో ఒక స్థాయిలో EVMలను వినియోగిస్తున్నాయి

0

ప్రపంచంలో 195 దేశాలున్నా కేవలం నైజీరియా, వెనిజులా మరియు భారత్ మాత్రమే EVM మెషిన్‌లను వాడుతున్నాయని చెప్తున్న ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రపంచంలో 195 దేశాలున్నా కేవలం నైజీరియా, వెనిజులా మరియు భారత్ మాత్రమే EVM మెషిన్‌లను వాడుతున్నాయి.

ఫాక్ట్(నిజం): ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల్లో EVMల వినియోగంపై సందేహాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో జాతీయ స్థాయి ఎన్నికల్లో EVMలను వాడుతుండగా, 17 దేశాలలో ప్రాంతీయ ఎన్నికల్లో వీటిని వాడుతున్నారు. నాలుగు దేశాలలో EVMలను కేవలం పలు సందర్భాలలో (యూనియన్ ఎన్నికల్లో) మాత్రమే వాడుతుండగా, 144 దేశాలలో మాత్రం వీటిని అసలు ఉపయోగించట్లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల్లో EVMల వినియోగంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే పోస్టులో చేస్తున్న వాదనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రస్తుతం ఎదో సందర్భంలో EVMలను వాడుతున్నాయి. కొన్ని దేశాలు పూర్తి స్థాయిలో వాడుతుంటే, మరికొన్ని దేశాలు పరిమితంగా ఈ EVMలను ఉపయోగిస్తున్నాయి.

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఇంటర్నేషనల్ IDEA) అనే అంతర్ ప్రభుత్వ సంస్థ సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలు జాతీయ స్థాయి ఎన్నికల్లో EVMలను వాడుతుండగా, 17 దేశాల్లో ప్రాంతీయ ఎన్నికల్లో వీటిని వాడుతున్నారు.

నాలుగు దేశాల్లో EVMలను కేవలం పలు సందర్భాలలో (యూనియన్ ఎన్నికల్లో) మాత్రమే వాడుతుండగా, 144 దేశాల్లో మాత్రం వీటిని అసలు ఉపయోగించట్లేదు. భారత్, బ్రెజిల్, వెనిజులా వంటి దేశాలు పూర్తి స్థాయిలో EVMలను వినియోగిస్తుండగా, అమెరికా, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలు పూర్తి స్థాయిలో కాకుండా పరిమిత స్థాయిలో వినియోగిస్తున్నాయి.

2017లో ఇదే అంశానికి సంబంధించి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకి బదులిస్తూ  కేంద్ర ప్రభుత్వం ‘ప్రస్తుతం నమీబియా, అర్మేనియా, భూటాన్, ఆస్ట్రేలియా, బల్గేరియా, ఎస్టోనియా, ఇటలీ, స్విట్జర్లాండ్, కెనడా, మెక్సికో, USA, అర్జెంటీనా, బ్రెజిల్ మరియు వెనిజులా దేశాలలో ఎన్నికలను EVM ద్వారా నిర్వహిస్తున్నారని తెలిపింది.

వివిధ దేశాలలో EVMల వినియోగం ఎలా ఉందో మరింత సమాచారం ఇక్కడ చూడొచ్చు. అలాగే EVMల వినియోగానికి సంబంధించి పలు దేశాలలోని పరిస్థితులకు సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ సమాచారం ప్రకారం కేవలం ఒకటి రెండు దేశాల్లోనే కాకుండా చాలా దేశాల్లో EVMలను ఎదో ఒక స్టేజిలో వినియోగిస్తున్నారని స్పష్టమవుతుంది.

చివరగా, ప్రపంచవ్యాప్తంగా చాలావరకు దేశాలు ఏదో ఒక స్థాయిలో EVMలను వినియోగిస్తున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll