Fake News, Telugu
 

విజయ్ మాల్యాకు అప్పు అందించడంలో మన్మోహన్ సింగ్‌, చిదంబరంల ప్రత్యక్ష పాత్ర ఉందని బ్రిటన్ కోర్టు వ్యాఖ్యలు చేయలేదు

0

బ్యాంకులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా విజయ్ మాల్యాకి అప్పు ఇప్పించినందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరంని లండన్ కోర్టు తప్పు పట్టిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి షరతులు లేకుండా కార్పొరేట్లకు అడ్డగోలుగా రుణాలు ఇచ్చారంటూ ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: విజయ్ మాల్యాకు బ్యాంకుల నుండి అప్పు ఇప్పించడంలో మన్మోహన్ సింగ్‌, చిదంబరంల ప్రత్యక్ష పాత్ర ఉందని బ్రిటన్ కోర్టు వ్యాఖ్యలు చేసింది.  

ఫాక్ట్ (నిజం): భారత బ్యాంకుల నుండి వేల కోట్లు అప్పుగా తీసుకొని పరారైన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ వెస్ట్ మిన్‌స్టర్ కోర్టు న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్ 10 డిసెంబర్ 2018 నాడు తీర్పు ఇచ్చారు. అయితే, విజయ్ మాల్యాకు రుణాలు ఇచ్చే ప్రక్రియలో భారత బ్యాంకులు చేసిన నిర్లక్ష్యాన్ని బ్రిటన్ కోర్టు విమర్శించింది. బ్యాంకులు తమ స్వంత నియమాలకు కట్టుబడి ఉండకుండా, తక్కువ రేటింగ్ ఉన్నప్పటికీ, గ్యారెంటీలను నామమాత్రంగా పరిశీలించి విజయ్ మాల్యాకు అప్పు ఇచ్చారని న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్ విమర్శించారు. విజయ్ మాల్యాకు అప్పు అందించడంలో మన్మోహన్ సింగ్‌, చిదంబరంల ప్రత్యక్ష పాత్ర ఉందని బ్రిటన్ కోర్టు ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు విజయ్ మాల్యాకు బ్యాంకుల నుండి అప్పు ఇప్పించడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరంల ప్రత్యక్ష పాత్ర ఉందని బ్రిటన్ కోర్టు వ్యాఖ్యానించిందా అని వెతికితే, బ్రిటన్ కోర్టు విజయ్ మాల్యా కేసుకి సంబంధించి అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది.

భారత బ్యాంకుల నుండి వేల కోట్లు అప్పుగా తీసుకొని పరారైన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ వెస్ట్ మిన్‌స్టర్ కోర్టు న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్ 10 డిసెంబర్ 2018 నాడు తీర్పు ఇచ్చారు. అయితే, ఈ తీర్పులో విజయ్ మాల్యాకు రుణాలు ఇచ్చే ప్రక్రియలో భారత ప్రభుత్వ బ్యాంకులు చేసిన నిర్లక్ష్యాన్ని ఎమ్మా అర్బుత్నాట్ విమర్శించినట్టు తెలిసింది.

బ్యాంకులు తమ స్వంత నియమాలకు కట్టుబడి ఉండకుండా, తక్కువ రేటింగ్ ఉన్నప్పటికీ, గ్యారెంటీలను నామమాత్రంగా పరిశీలించి విజయ్ మాల్యాకు అప్పు ఇచ్చారని అర్బుత్నాట్ తన తీర్పులో విమర్శించారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2018 డిసెంబర్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. విజయ్ మాల్యాకు అప్పు అందించడంలో మన్మోహన్ సింగ్‌, చిదంబరంల ప్రత్యక్ష పాత్ర ఉందని బ్రిటన్ కోర్టు ఈ తీర్పులో ఎక్కడా వ్యాఖ్యానించలేదు.

విజయ్ మాల్యా అప్పగింత కేసుకి సంబంధించి బ్రిటన్ కోర్టు 2020 ఏప్రిల్ నెలలో వెలువరించిన తీర్పులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. రుణాల ఎగవేతకు విజయ్ మాల్యాకు సహాకారం అందించిన వారి జాబితాలో మన్మోహన్ సింగ్ లేదా చిదంబరంల పేర్లని బ్రిటన్ కోర్టు ప్రస్తావించలేదు. విజయ్ మాల్యాకు అప్పు అందించడంలో తమ పాత్ర ఉందని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను మన్మోహన్ సింగ్ మరియు చిదంబరం గతంలో ఖండించారు.

చివరగా, విజయ్ మాల్యాకు అప్పు అందించడంలో మన్మోహన్ సింగ్‌, చిదంబరంల ప్రత్యక్ష పాత్ర ఉందని బ్రిటన్ కోర్టు వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll