ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భారత రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ సనాతన భారతీయ సంస్కృతి ప్రకారం ఆయుధ పూజ నిర్వహించాడని చెప్తూ, రాజనాథ్ సింగ్ రఫేల్ విమానం పై ‘ఓం’ మరియు ‘స్వస్తిక్’ రాస్తున్నట్టు ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్ (దావా): రఫేల్ విమానాలను అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టిన కార్యక్రమంలో రఫేల్ విమానం పై ‘ఓం’ మరియు ‘స్వస్తిక్’ రాస్తున్న రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోనిది ఒక ఎడిటెడ్ ఫోటో. గత సంవత్సరం ఫ్రాన్స్ లో రాజనాథ్ సింగ్ రఫేల్ పై ‘ఓం’ రాసినప్పటి ఫోటోని తీసుకొని, భారత్ లో తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో తీసిన ఫోటోపై అమర్చారు. రఫేల్ విమానాలను అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టిన కార్యక్రమంలో ‘సర్వ ధర్మ పూజ’ నిర్వహించినట్టు రాజనాథ్ సింగ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోని 10 సెప్టెంబర్ 2020 న ‘ANI’ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే, ఒరిజినల్ ఫోటోలో రాజనాథ్ సింగ్ లేరు; రఫేల్ పై ‘ఓం’ మరియు ‘స్వస్తిక్’ కూడా లేవు. ఎడిటెడ్ ఫోటోలో రాజనాథ్ సింగ్ కాళ్ళు కూడా లేనట్టు గమనించవొచ్చు.

పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న రాజనాథ్ సింగ్ ని గత సంవత్సరం ఫ్రాన్స్ లో రాజనాథ్ సింగ్ రాఫెల్ పై ‘ఓం’ రాసినప్పటి ఫోటోలో నుండి తీసుకున్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు, 10 సెప్టెంబర్ 2020 న కార్యక్రమంలో రాజనాథ్ సింగ్ వేసుకున్న డ్రెస్ రంగు మరియు ఫోటోలో రాజనాథ్ సింగ్ వేసుకున్న డ్రెస్ రంగు ఒకటి కాదు.

రఫేల్ విమానాలను అధికారికంగా భారత వాయుసేనలో ప్రవేశపెట్టిన కార్యక్రమంలో ‘సర్వ ధర్మ పూజ’ నిర్వహించినట్టు రాజనాథ్ సింగ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు.
చివరగా, రఫేల్ విమానం పై రాజనాథ్ సింగ్ ‘ఓం’ మరియు ‘స్వస్తిక్’ రాస్తున్నట్టు ఉన్నది ఒక ఎడిటెడ్ ఫోటో.