Fake News, Telugu
 

డబ్బు వివాదానికి సంబంధించిన ఒక పాత ఘర్షణ వీడియోని ‘భారత్ మాతా కి జై’ అన్నందుకు వృద్ధుడిని ముస్లింలు కొడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు ఒక వృద్ధుడిని చితకబాదుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. హిందువుగా ఈ దేశంలొ జీవించాలంటే, కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం మరియు టీడీపీ పార్టీలను బహిష్కరించాలంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఈ వీడియోలో వృద్ధుడిపై దాడి చేసినది ముస్లింలని కొందరు ఇదివరకు పోస్టులు పెట్టారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు ఒక వృద్ధుడిని ముస్లింలు కొడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని ఘటన రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలో 2019 అక్టోబర్ నెలలో చోటుచేసుకుంది. డబ్బు వివాదానికి సంబంధించి ఇతరులను దుర్భాషలాడినందుకు హోత్‌చంద్ సింధీ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కొడుతున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు ఆ వృద్ధుడిని కొట్టలేదు. అలాగే, ఈ ఘటనలో మతపరమైన కోణమేమీ లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలను కనీసం 2019 అక్టోబర్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ వీడియోని షేర్ చేస్తూ 2019లో పెట్టిన ఒక ట్వీట్‌కు స్పందిస్తూ వీడియోలోని ఘటన రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలో చోటుచేసుకుందని ఒక యూసర్ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన స్పష్టత కోసం ఫాక్ట్‌లీ 2019 డిసెంబర్ నెలలో అప్పటి భిల్వారా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ మీనాను సంప్రధించింది. ఈ ఘటన గురించి రాజేష్ మీనా స్పంధిస్తూ, “వీడియోలో దాడికి గురైన వృద్ధుడి పేరు హోత్‌చంద్ సింధీ. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. భార్యను చంపిన కేసులో మరియు ఇతర గొడవల కేసులలో ఇదివరకు అతను అరెస్ట్ అయ్యాడు. భిల్వారాలోని ఆజాద్ చౌక దగ్గర డబ్బు విషయంపై ఇతరులను దుర్భాషలాడినందుకు అతన్ని కొట్టారు. ‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు అతన్ని కొట్టలేదు.”, అని మాకు తెలిపారు.

2019 అక్టోబర్ నెలలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుపుతూ అప్పటి ఢిల్లీ రాజౌరి గార్డెన్ ఎంఎల్ఏ మంజిందర్ సింగ్ సిర్సా ట్వీట్ కూడా పెట్టారు.

ఈ ఘటనకు సంబంధించి భిల్వారా జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని ఇక్కడ చూడవచ్చు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ‘భారత్ మాతా కి జై’ అనే పదాలను ఎక్కడ ప్రస్తావించలేదు. అలాగే, ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా పేర్కొనబడిన వారందరూ ముస్లింలు కాదు. ఈ దాడికి పాలుపడిన వ్యక్తులలో ముస్లింలు, సింధీలతో సహా ఇతర మతస్థులు కూడా ఉన్నారని ఫిర్యాదుదారుడు ఎఫ్ఐఆర్‌లో స్పష్టంగా తెలిపారు.  

చివరగా, డబ్బు వివాదానికి సంబంధించిన ఒక పాత ఘర్షణ వీడియోని ‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు వృద్ధుడిని ముస్లింలు కొడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll