Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అంబేద్కర్ చిత్రపటంపై ఒక వ్యక్తి కాలు పెట్టినట్టు షేర్ చేస్తున్నారు

0

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి డా. బి. ఆర్. అంబేద్కర్‌ చిత్రపటం పై కాళ్లు పెట్టి  ఫొటోలకి ఫోజులిస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డా. బి. ఆర్. అంబేద్కర్‌ చిత్రపటంపై ఒక వ్యక్తి కాలు పెట్టి ఫొటోలకి ఫోజులిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలో ఆ వ్యక్తి తన కాలుని శివలింగం పై పెట్టాడు, అంబేద్కర్‌ చిత్రపటంపై కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు 2019లో శివలింగంపై కాలు పెట్టి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ముగ్గురిపై కేసు రిజిస్టర్ చేసినట్టు అంబేద్కర్‌నగర్ పోలీసులు ట్వీట్ పెట్టారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని చాలా మంది సోషల్ మీడియా యూసర్లు ఆగష్టు 2019లో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్టులలో షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో అంబేద్కర్ చిత్రపటం లేదు. ఒరిజినల్ ఫోటోలో ఆ వ్యక్తి శివలింగంపై కాలు పెట్టి ఫొటోలకి ఫోజులిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు కూడా శివలింగం పై కాలు పెట్టి ఫోజులిచ్చారు. ఆ ఫోటోలని అన్షుల్ సక్సేనా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ, హిందూమత మనోభావాలను దెబ్బతీసేలా శివలింగం పై కాళ్లు పెట్టి ఫోజులిచ్చిన ముగ్గురు వ్యక్తులని అంబేద్కర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగర్ జిల్లాలో చోటుచేసుకుందని ఒక ట్విట్టర్ యూసర్ ట్వీట్ పెట్టగా, ఈ ఫోటో పై స్పష్టతనిస్తూ ఆజంగర్ పోలీసులు ట్వీట్ చేసారు. ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు  అంబేద్కర్‌నగర్‌ జిల్లా అలాపూర్ పట్టణానికి సంబంధించిన వారని తమ ట్వీట్లో తెలిపారు. కోర్జా హరిజన్ బస్తీకి చెందిన రిషి కుమార్, నీరజ్ కుమార్ శివలింగం పై కాలు పెట్టి ఫొటోలకు ఫోజులిచ్చినట్టు వారు తమ ట్వీట్లో తెలిపారు. హిందూమత మనోభావాలను దెబ్బతీసేలా శివలింగం పై కాలు పెట్టినందుకు ఆ ముగ్గురి పై కేసులు పెట్టినట్టు అంబేద్కర్‌నగర్ పోలీసులు ట్వీట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలోని వ్యక్తి తన కాలు శివలింగం పెట్టారని, అంబేద్కర్ చిత్రపటం పై కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా,  ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అంబేద్కర్ చిత్రపటంపై ఒక వ్యక్తి కాలు పెట్టి ఫోజులిస్తున్న దృశ్యమంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll