Fake News, Telugu
 

పాకిస్థాన్ మరియు ముస్లింల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలుగా షేర్ చేస్తున్న ఈ ABP న్యూస్ ఫోటోలు మార్ఫ్ చేయబడినవి

0

పాకిస్థాన్ గురించి, ముస్లింల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని తెలువుతూ ‘ABP’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన న్యూస్ టెంప్లేట్ల ఫోటోలు, అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ‘ABP’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ న్యూస్ టెంప్లేట్లలో, రాహుల్ గాంధీ, “నా పూర్వికులు ముస్లింలు. నేను ముస్లింనే”, “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాకిస్థాన్ దేశానికి 5వేల కోట్ల రుణాన్ని 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా ఇస్తాం”, “పాకిస్థాన్‌కు మద్దతు తెలుపడం చాలా అవసరం మరియు మేము ఆ పని తప్పకుండా చేస్తాం”, “కాంగ్రెస్ ముస్లింలకు చెందిన పార్టీ. ఇకముందు కూడా అది ముస్లింలకు మాత్రమే చెందుతుంది”, అని పేర్కొనట్టు చూపిస్తుంది. ఈ ‘ABP’ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్లు గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.     

క్లెయిమ్: పాకిస్థాన్ గురించి ముస్లింల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని ‘ABP’ వార్తా సంస్థ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ టెంప్లేట్ల ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ABP న్యూస్ టెంప్లేట్ల ఫోటోలు మార్ఫ్ చేయబడినవి. ఈ ఫోటోలలో కనిపిస్తున్న టెక్స్ట్ ఫాంట్‌ ABP న్యూస్ టెంప్లేట్ ఫాంట్‌కు భిన్నంగా ఉంది. ABP టెంప్లేట్లతో పోలి ఉన్న ఈ ఫోటోలను తమ వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని ABP వార్తా సంస్థ గతంలోనే ట్వీట్ కూడా చేసింది. పాకిస్థాన్ మద్దతు పలకాలని గాని, తన పూర్వీకులు ముస్లిం మతానికి చెందిన వారని గాని, కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం పుట్టిందని రాహుల్ గాంధీ ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.       

పోస్టులో షేర్ చేసిన ఫోటోలకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికితే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఇలాంటి కొన్ని ABP న్యూస్ టెంప్లేట్ల గురించి స్పష్టతనిస్తూ ABP వార్తా సంస్థ 2018 నవంబర్ నెలలో ఒక ట్వీట్ చేసినట్టు తెలిసింది.  “నా పూర్వికులు ముస్లింలు. నేను ముస్లింనే”, “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాకిస్థాన్ దేశానికి 5వేల కోట్ల రూపాయిల రుణాన్ని 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా ఇస్తాం”, అని రాహుల్ గాంధీ పేర్కొన్నట్టుగా షేర్ చేస్తున్న న్యూస్ టెంప్లేట్లను తమ వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదని ‘ABP’ తమ ట్వీట్లో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ‘ABP’ టెంప్లేట్లతో షేర్ చేస్తున్న ఈ ఫోటోలు ఎడిట్ చేయబడినవని ‘ABP’ స్పష్టం చేసింది. 

కాంగ్రెస్ ముస్లింలకు చెందిన పార్టీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారా? అని వెతికితే, 2018లో జరిగిన ఒక ముస్లిం కమ్యూనిటీ మీటింగులో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముస్లింలకు సంబంధించిన పార్టీ అని పేర్కొన్నట్టు ‘Inquilab’ అనే ఉర్దూ వార్త పత్రిక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అయతే, ‘Inquilab’ వార్త పత్రిక రిపోర్ట్ చేసిన సమాచారం తప్పని కాంగ్రెస్ పార్టీ అప్పుడే స్పష్టం చేసింది. ‘Inquilab’ పేర్కొన్న మీటింగ్ లో రాహుల్ గాంధీ, దేశంలోని అన్ని మతాల లాగే ముస్లిం మత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తామని పేర్కొన్నట్టు ‘Scroll.in’ న్యూస్ వెబ్సైటు రిపోర్ట్ చేసింది. తన పై వస్తున్న ఈ వివాదాస్పద వార్తల గురించి రాహుల్ గాంధీ స్పందిస్తూ, కాంగ్రెస్ దేశంలోని అన్ని మతాలకి  సంబంధించిన పార్టీ అని 17 జూలై 2018 నాడు ట్వీట్ పెట్టారు.

“పాకిస్థాన్‌కు మద్దతు తెలుపడం చాలా అవసరం మరియు మేము ఆ పని తప్పకుండా చేస్తాం”, అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు ఏటివంటి ఆధారాలు దొరకలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటోలని ‘ABP’ వార్తా సంస్థ ఒరిజినల్ టెంప్లేట్లతో పోల్చి చూడగా, పోస్టులో షేర్ చేసిన న్యూస్ టెంప్లేట్ల ఫాంట్‌, ABP న్యూస్ టెంప్లేట్ ఫాంట్‌కు భిన్నంగా ఉందని చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ABP న్యూస్ టెంప్లేట్ల ఫోటోలు మార్ఫ్ చేయబడినవని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పాకిస్థాన్ మరియు ముస్లింల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలుగా షేర్ చేస్తున్న ఈ ABP న్యూస్ టెంప్లేట్ల ఫోటోలు మార్ఫ్ చేయబడినవి.

Share.

About Author

Comments are closed.

scroll