వారాంతపు సెలవును ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోదీ సంకేతాలు ఇచ్చారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. జార్ఖండ్‌లోని దుమ్కాలో మాట్లాడుతూ మోదీ ఈ సంకేతాలు ఇచ్చారంటూ ఈ వార్తలో చెప్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: వారాంతపు సెలవును ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోదీ సంకేతాలు ఇచ్చారు.
ఫాక్ట్(నిజం): వారాంతపు సెలవును శుక్రవారానికి మారుస్తామని మోదీ అనలేదు. అంతకుముందు జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు వారాంతపు సెలవును ఆదివారం నుండి శుక్రవారానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్న అంశంలో అధికార పార్టీను విమర్శిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్‌లోని దుమ్కాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఆదివారం సెలవుల గురించి ప్రస్తావించారు. ఐతే మోదీ ఈ ప్రస్తావన చేసింది ఈ సెలవును శుక్రవారానికి మార్చే ఉద్దేశంలో కాదు. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా దీనికి సంబంధించిన వార్తా కథనాలు మాకు కనిపించాయి.
ఈ కథనాల ప్రకారం మోదీ మాట్లాడుతూ ఆదివారం సెలవుల చరిత్రను వివరించే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో, క్రైస్తవ సమాజం ఆదివారాలను సెలవుదినంగా జరుపుకునేదని అయన అన్నారు. “ఆదివారం హిందువులతో సంబంధం లేదు, క్రైస్తవ సమాజంతో ముడిపడి ఉంది. ఇది గత 200-300 సంవత్సరాలుగా కొనసాగుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
2022లో జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లా ఆదివారం సెలవును శుక్రవారానికి మారుస్తూ చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేసారు. జులై 2022లో జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో 43 పాఠశాలలు వారాంతపు సెలవును ఆదివారం నుండి శుక్రవారానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే అప్పట్లో దీనిపై విమర్శలు రావడంతో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కేవలం హిందువులతోనే కాకుండా క్రైస్తవులతో కూడా ఘర్షణకు పాల్పడుతోందని ప్రధాని ఆరోపించారు. ఆదివారం సెలవును క్రైస్తవానికి ముడిపెడుతూ మోదీ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీను ఉద్దేశించి చేసినవే కానీ వైరల్ పోస్టులో ఆరోపిస్తున్నట్టు వారాంతపు సెలవును ఆదివారం నుండి శుక్రవారానికి మార్చే ఉద్దేశంలో కాదు.
చివరగా, వారాంతపు సెలవును శుక్రవారానికి మార్చే అంశంలో జార్ఖండ్‌లో అధికారిక పార్టీను ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు.