ఒక చేప సముద్ర అడుగు భాగంలో మహావిష్ణు సుదర్శన చక్రాన్ని గీసిందని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పడు చూద్దాం.

క్లెయిమ్: ఒక చేప సముద్ర అడుగు భాగంలో మహావిష్ణు సుదర్శన చక్రాన్ని గీస్తున్న వీడియో.
ఫాక్ట్: ఆడ చేపలను ఆకర్షించడానికి తెల్ల మచ్చలు గల మగ పఫర్ చేపలు ఇటువంటి గుండ్రని ఆకరాలను చేస్తాయి. ఈ ఆకారం మధ్యలోని ఇసుక రేణువులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆడ చేప మగ చేపతో కలిశాక, ఈ సున్నితమైన ఇసుకలో గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. మగ చేప ఆ గుడ్లు పొదిగే వరకు వాటికి కాపలా ఉంటుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ వీడియో గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇది 2014 లో వచ్చిన ‘లైఫ్ స్టోరీ’ అనే బీబీసీ డాక్యుమెంటరీలోని వీడియో క్లిప్ అని గుర్తించాము. డాక్యుమెంటరీలో చెప్పిన వివరాల ప్రకారం, ‘Japanese Puffer Fish’ అని పిలువబడే ఈ చేపలలోని మగ చేపలు ఆడ చేపలను ఆకర్షించడానికి ఇటువంటి ఆకారాలను సముద్ర అడుగు భాగంలోని ఇసుకలో తమ రెక్కలతో గీస్తాయి. ఇదే వీడియోని ఇక్కడ కూడా చూడవచ్చు.

Nature, National Library of Medicine, మరియు ఇతర రిసెర్చ్ పేపర్ల ప్రకారం, తెల్ల మచ్చలు కలిగిన మగ పఫర్ చేపలు ఇటువంటి ఆకరాలను గీస్తాయని 2013లో నిర్ధారించారు. 1995 లోనే ఇటువంటి ఆకారాలను సముద్రంలో గుర్తించినా, అవి ఎలా ఏర్పడ్డాయో తెలియలేదు. గుండ్రంగా ఉండే ఈ ఆకరాలను మగ పఫర్ చేపలు 7-9 రోజుల్లో గీస్తాయి. ఈ ఆకారం మధ్యలోని ఇసుక రేణువులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆడ చేప మగ చేపతో కలిశాక, ఈ సున్నితమైన ఇసుకలో గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. మగ చేప ఆ గుడ్లు పొదిగే వరకు వాటికి కాపలా ఉంటుంది.

చివరిగా, ఆడ చేపలను ఆకర్షించడానికి మగ పఫర్ చేపలు ఇటువంటి గుండ్రని ఆకరాలను చేస్తాయి.