‘బిజెపి దెబ్బకు కెటిఆర్ తన పార్టీ గుర్తు మర్చిపోయాడు’, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. GHMC ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో KTR, పొరపాటున ప్రజలకు కమలం గుర్తుకు ఓటు వేయమని చెప్పినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: GHMC ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో, KTR ప్రజలను కమలం గుర్తుకు ఓటు వేయమని చెప్పారు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో KTR ఇటివల కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన రోడ్ షో కి సంబంధించినది. GHMC ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించారు. ఈ వీడియోలో కెటిఆర్ కారు గుర్తుకు మాత్రమే వోటు వేయమన్నారు. కమలం గుర్తుకు వోటు వేయమని ఎక్కడా అనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులోని వీడియో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వలన KTR కమలం గుర్తుకు ఓటు వేయమనట్టు కొందరు పొరబడుతున్నారు. పోస్టులోని వీడియోని కొంచెం నెమ్మదించి వింటే KTR కారు గుర్తుకు ఓటు వేయమనట్టు స్పష్టంగా తెలుస్తుంది. పోస్టులోని వీడియో యొక్క నెమ్మదించిన క్లిప్ క్రింద చూడవొచ్చు. KTR ఓటు వేయిమంది ‘కారు గుర్తుకే’ అని ఇందులో స్పష్టంగా వినిపిస్తుంది.
పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన వివరాల కోసం వెతికితే, ఈ వీడియో KTR ఇటివల కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన రోడ్ షో కి సంబంధించినదని తెలిసింది. GHMC ఎన్నికలు జరుగబోతున్న నేపధ్యంలో ‘21 నవంబర్ 2020’ నాడు ఈ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో కి సంబంధించిన పూర్తి వీడియోని తెరాస పార్టీ తమ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసింది.
ఆ వీడియోలో KTR ఇచ్చిన స్పీచ్ ని జాగ్రత్తగా గమనిస్తే, కారు గుర్తుకు వోటు వేయమని మాత్రమే KTR ప్రజలని కోరినట్టు తెలుస్తుంది. కమలం గుర్తుకు వోటు వేయమని KTR ఎక్కడ చెప్పలేదు. పోస్టులో షేర్ చేసిన వీడియోలో ఆడియో సరిగా లేకపోవడంతో, కొందరు సోషల్ మీడియాలో KTR కమలం గుర్తుకు వోటు వేయమని చెప్పినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
చివరగా, ఆడియో సరిగా లేని వీడియోని చూపిస్తూ KTR తన రోడ్ షో లో బిజెపి కి వోటు వేయమని చెప్పినట్టుగా షేర్ చేస్తున్నారు.