Fake News, Telugu
 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు 22,267 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించలేదు

0

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఇటీవల దాఖలు చేసిన నామినేషన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మొత్తంగా రూ. 22,267 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించుకున్నారు, అంటూ ‘Way2News’ పబ్లిష్ చేసిన ఒక న్యూస్ రిపోర్ట్ స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్నికల నామినేషన్లో రాజగోపాల్ రెడ్డి తన పేరు మీద మొత్తంగా రూ. 22,267 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన భార్య లక్ష్మీ పేరు మీద రూ. 5,244 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించుకున్నారంటూ ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ఇటీవల దాఖలు చేసిన నామినేషన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మొత్తంగా రూ. 27,512 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించుకున్నారు.

ఫాక్ట్ (నిజం): మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పేరు మీద మొత్తంగా రూ. 222.67 కోట్ల ఆస్తులు ఉన్నట్టు, తన భార్య పేరు మీద రూ. 52.44 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. రాజగోపాల్ రెడ్డి తనకు మొత్తంగా రూ. 275.12 కోట్ల ఆస్తులు ఉన్నట్టు మాత్రమే ఇటీవల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 12 అక్టోబర్ 2022 నాడు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లభించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్పించిన ఈ ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద రూ. 152.29 కోట్ల (Rs.152,69,94,600) స్థిరాస్తులు, రూ. 69.97 కోట్ల (Rs.69,97,70,142) చరాస్తులు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. ఈ లెక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద మొత్తంగా 222.67 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది.  

అలాగే, రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో తన భార్య లక్ష్మీ పేరు మీద రూ. 48.55 కోట్ల (Rs. 48,55,25,250) స్థిరస్తులు, రూ. 3.89 కోట్ల (Rs. 3,89,63,167) చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. తన భార్య లక్ష్మీపేరు మీద మొత్తంగా రూ. 52.44 కోట్ల ఆస్తులు ఉన్నట్టు రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఈ లెక్కన రాజగోపాల్ రెడ్డి తనకు సుమారుగా రూ. 275.12 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ‘Way2News’ గణాంకాలను విడదీసే క్రమంలో చేసిన తప్పిదం వలన రాజగోపాల్ రెడ్డి తనకు రూ. 27,512 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించుకున్నారని సోషల్ మీడియాలో తప్పుగా పోస్టులు పెడుతున్నారు.   

చివరగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు మొత్తంగా రూ. 275.12 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించుకున్నాడు. 27,512 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించలేదు.  

Share.

About Author

Comments are closed.

scroll