Fake News, Telugu
 

పాకిస్తాన్ లోని ఈ హిందూ కుటుంబాన్ని చంపింది అక్కడి ముస్లింలు కాదు

0

‘పాకిస్తాన్ లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన 5 మందిని కత్తి గొడ్డలితో నరికి చంపిన అక్కడి మెజారిటీలు’ అని చెప్తూ కొన్ని మృతదేహాలు ఉన్న ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్ లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన 5 మందిని కత్తి గొడ్డలితో నరికి చంపిన అక్కడి మెజారిటీలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఘటనకి సంబంధించిన పాకిస్తాన్ వార్తా కథనాల ప్రకారం ముల్తాన్ కి చెందిన రామ్ చంద్ అనే వ్యక్తి తన భార్య మరియు ముగ్గురు పిల్లల గొంతు కోసి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకోన్నాడు. పైగా రామ్ చంద్ బావమరిది ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రిజిస్టర్ చేసిన FIR లో కూడా ఇదే విషయం రాసి ఉంది. ఈ హిందూ కుటుంబాన్ని అక్కడి మెజారిటీలు చంపారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయాన్ని గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ వార్తని ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకు లభించాయి. ఈ వార్తని మొదట ANI ’06 మార్చ్ 2021’న ప్రచురించింది. పాకిస్తాన్ లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హిందువులు అనుమాన్సాపద పరిస్థితుల్లో మృతిచెందారు అని పాకిస్తాన్ కి చెందిన ద న్యూస్ ఇంటర్నేషనల్ కథనం ఆధారంగా ANI ఈ కథనాన్ని ప్రచురించింది. ఐతే ANI కథనాన్ని ఆధారంగా చేసుకొని మరికొన్ని  భారత న్యూస్ ఏజెన్సీస్ ఇదే వార్తని ప్రచురించాయి, వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ABP న్యూస్ మాత్రం ఈ వార్తని ‘పాకిస్తాన్ లో హిందువులపై దాడి, ఒకే కుటుంభానికి చెందిన ఐదుగురిని గొంతు కోసి హత్య చేసారు అనే సారాంశంతో ప్రచురించింది’.  దీన్నిబట్టి పోస్టులోని వార్త ABP న్యూస్ నుండి మొదలైందని అర్ధంచేసుకోవచ్చు.

ఐతే ఈ వార్తకి సంబంధించి పాకిస్తాన్ వార్తా కథనాల కోసం వెతకగా ముల్తాన్ కి చెందిన రామ్ చంద్ అనే వ్యక్తి తన భార్య మరియు ముగ్గురు పిల్లల గొంతు కోసి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకొన్నాడని చెప్తూ కొన్ని పాకిస్తాన్ సంస్థలు వార్తా కథనాలు ప్రచురించాయి. ఐతే ఉద్యోగం లేక పేదరికం తట్టుకోలేక ఇలా చేసారని కొన్ని వార్తా కథనాలు రాయగా, మరికొన్ని కథనాలు భార్య అక్రమ సంబంధాల నేపథ్యంలో ఇలా చేసారని కొన్ని కథనాలు రాసాయి. ఈ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. పైగా రామ్ చంద్ బావమరిది ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా FIR రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చాలా వార్తా కథనాలు రాసాయి. దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నట్టు ఈ హిందూ కుటుంభాన్ని చంపింది అక్కడి మెజారిటీలు కాదని అర్ధమవుతుంది.

Alt News అనే ఫాక్ట్–చెకింగ్ ఏజెన్సీ పాకిస్తాన్ జర్నలిస్ట్ ని సంప్రదించి రాసిన కథనంలో ఈ కేసుకి సంబంధించిన FIR ని ప్రచురించింది. ఈ FIR ప్రకారం రామ్ చంద్ తన కుటుంబసభ్యులను చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడని ఉంది. వీటన్నిటి బట్టి పాకిస్తాన్ లోని హిందూ కుటుంబాన్ని చంపింది అక్కడి ముస్లిమ్స్ కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

అయితే, గతంలో పాకిస్తాన్ లోని హిందువుల మీద దాడులు జరిగిన మాట వాస్తవమే. మైనారిటీల మీద పాకిస్తాన్లో దాడులు జరగడంతో, అనేక మానవ హక్కుల సంస్థలు ఈ అంశాన్ని లేవనెత్తాయి.

చివరగా, పాకిస్తాన్ లోని ఈ హిందూ కుటుంబాన్ని చంపింది అక్కడి ముస్లింలు కాదు. రామ్ చంద్ అనే వ్యక్తి తన భార్య మరియు ముగ్గురు పిల్లల గొంతు కోసి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకొన్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll