Fake News, Telugu
 

జస్టిస్ దల్వీర్ భండారీ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ‘చీఫ్ జస్టిస్’గా ఎన్నుకోబడలేదు, అలాంటి పదవి ఆ న్యాయస్థానంలో లేదు

0

అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విస్తృతంగా షేర్ అవుతోంది. పోస్ట్‌లో చేసిన క్లెయిమ్‌లో వాస్తవాన్ని పరిశీలిద్దాం.

క్లెయిమ్: జస్టిస్ దల్వీర్ భండారీ ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు.

ఫాక్ట్ (నిజం): అంతర్జాతీయ న్యాయస్థానంలో ‘చీఫ్ జస్టిస్’ అనే పోస్టు లేదు. జస్టిస్ దల్వీర్ భండారీ 27 ఏప్రిల్ 2012 నుండి కోర్టు సభ్యుడు, మరియు 06 ఫిబ్రవరి 2018 నుండి తొమ్మిదేళ్ల కాలానికి తిరిగి ఎన్నికయ్యారు. అందువల్ల పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) వారి శాసనంలో ‘చీఫ్ జస్టిస్’ అనే పదవి గురించి ప్రస్తావన లేదు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ని మూడేళ్ళ నిర్ణీత కాలానికి ఎన్నుకొంటారు (అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క శాసనంలోని ఆర్టికల్ 21). 08 ఫిబ్రవరి 2021న, జడ్జి జోన్ ఇ. డోనోఘ్యూ (USA) మరియు జడ్జి కిరిల్ గెవోర్జియన్ (రష్యన్ ఫెడరేషన్) ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) వెబ్‌సైట్ లో కోర్టు సభ్యులందరి వివరాలు, వారి హోదా ఉన్నాయి. వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి అనే పదవి లేదు. భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ భండారీని ప్రధాన న్యాయమూర్తిగా కాకుండా సభ్యునిగా ఆ వెబ్సైటులో  పేర్కొన్నారు.

27 ఏప్రిల్ 2012న, UPA హయాంలో, జస్టిస్ దల్వీర్ భండారీ ICJ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంతకుముందు సంవత్సరం రాజీనామా చేసిన మిస్టర్ ఔన్ షౌకత్ అల్-ఖాసావ్నే (జోర్డాన్) తర్వాత ఆయన  బాధ్యతలు స్వీకరించాడు. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) వారి శాసనంలోని ఆర్టికల్ 15 ప్రకారం, 05 ఫిబ్రవరి 2018 వరకు, న్యాయమూర్తి అల్-ఖాసావ్నే యొక్క మిగిలిన పదవీకాలం కోసం దల్వీర్ భండారీ పదవీ బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 2017లో, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో, జస్టిస్ దల్వీర్ భండారీ తిరిగి సభ్యునిగా ఎన్నికయ్యారు. 06 ఫిబ్రవరి 2018 నుండి రెండవసారి ఆయన తొమ్మిదేళ్ల పదవీకాలం ప్రారంభమైంది.

అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) సభ్యులు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మరియు భద్రతా మండలిచే ఎన్నుకోబడతారు. ఈ రెండు విభాగాలు ఒకే సమయంలో కానీ, ఒకదానికొకటి స్వతంత్రంగా కానీ ఓటు వేస్తాయి. ఎన్నిక కావడానికి, అభ్యర్థి రెండు విభాగాలలో సంపూర్ణ మెజారిటీని పొందాలి, అంటే సాధారణ అసెంబ్లీలో 97 ఓట్లు మరియు ప్రస్తుత సంఖ్యల ప్రకారం, భద్రతా మండలిలో ఎనిమిది ఓట్లు. ఈ ఎన్నికకు వీటో హక్కు వర్తించదు. అంతే కాదు, ఈ ఎన్నికలలో కౌన్సిల్ యొక్క శాశ్వత మరియు అశాశ్వత సభ్యుల ఓట్ల మధ్య తేడా లేదు.

2017లో జస్టిస్ దల్వీర్ భండారీ తిరిగి ఎన్నికైనప్పుడు, న్యాయమూర్తి క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్ (యుకె) కూడా అదే స్థానానికి పోటీ చేశారు. జనరల్ అసెంబ్లీ మరియు భద్రతా మండలిలో మొదట్లో వారిద్దరికీ పూర్తి మెజారిటీ రాలేదు. తరువాత, ఎన్నికలు వాయిదా పడ్డప్పుడు, సంఖ్యా బలం తమ వైపు లేదని తెలియడంతో బ్రిటిష్ అభ్యర్థి వైదొలిగారు. అందువల్ల, ఓటింగ్ ముగిసిన తర్వాత, జస్టిస్ దల్వీర్ భండారీ భద్రతా మండలిలో మొత్తం 15 ఓట్లను మరియు UN జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లలో 183 ఓట్లను పొందారు. 1945లో ICJ ఏర్పాటైన తర్వాత బ్రిటిష్ న్యాయమూర్తి లేకపోవడం ఇదే తొలిసారి.

అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన న్యాయవ్యవస్థ. ఇది జూన్ 1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ద్వారా స్థాపించబడింది మరియు ఏప్రిల్ 1946లో దాని కార్యకలాపాలను ప్రారంభించింది. జనరల్ అసెంబ్లీ మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా తొమ్మిదేళ్ల కాలానికి ఎన్నుకోబడిన 15 మంది న్యాయమూర్తులతో కోర్ట్ రూపొందించబడింది. కోర్టు యొక్క సీటు హేగ్ (నెదర్లాండ్స్)లోని పీస్ ప్యాలెస్‌లో ఉంది. కోర్టు రెండు ప్రధాన పత్రాలు పోషిస్తుంది: మొదటిది, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు సమర్పించిన చట్టపరమైన వివాదాలను పరిష్కరించడం, సంబంధిత పక్షాలకు ఎటువంటి అప్పీల్ అవకాశం లేకుండా కట్టుబడి ఉండే తీర్పుల ఇవ్వడం. రెండవది, ఐక్యరాజ్యసమితి విభాగాలు అడిగిన విషయాలపై న్యాయపరమైన సలహా, అభిప్రాయాలను అందించడం.

చివరిగా, జస్టిస్ దల్వీర్ భండారీ ICJ యొక్క ‘చీఫ్ జస్టిస్’గా ఎన్నుకోబడలేదు, అలాంటి పదవి కోర్టులో లేదు. అతను ప్రస్తుతం కోర్టు సభ్యుడు, 2018లో తొమ్మిదేళ్ల కాలానికి ఎన్నికయ్యారు.

Share.

About Author

Comments are closed.

scroll