ఇటీవల రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాహుల్ గాంధీని అవమానించే విధంగా ఒక ట్వీట్ చేశారని ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. మోదీ భారత్‌ను బహిరంగ మల మూత్ర విసర్జన రహిత దేశంగా మార్చినంత మాత్రాన రాహుల్ గాంధీ తమ దేశానికి వచ్చి ఆ పని చేయకూడదని బైడెన్ ట్వీట్ చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: రాహుల్ గాంధీని అవమానిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ట్వీట్ చేశారు.
ఫాక్ట్: సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నది నకిలీ ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్. జో బైడెన్ రాహుల్ గాంధీని అవమానిస్తూ ఎటువంటి ట్వీట్ చేయలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ అవుతున్న ట్వీట్ స్క్రీన్ షాట్లో ఇవ్వబడిన తేదీ, సమయం ఆధారంగా బైడెన్ ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా, అదే సమయానికి బైడెన్ వేరే ట్వీట్ చేసినట్లు గుర్తించాం. అయితే ఈ ట్వీట్‌లో ఆయన ఎక్కడా రాహుల్ గాంధీ గురించి చెప్పలేదు, కేవలం ద్వైపాక్షిక బడ్జెట్ ఒప్పందం గురించి ప్రస్తావించారు.
బైడెన్ ముందే రాహుల్ గాంధీ గురించి ట్వీట్ చేసి వెంటనే దాన్ని ఎడిట్ చేసి ఉంటారని చెప్పడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ప్రస్తుత ట్విట్టర్ నిభందనల ప్రకారం ఒక ట్వీట్‌ని ఎడిట్ చేస్తే, ట్వీట్ కింద ఎడిట్ చేసిన సమయం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడ చూడవచ్చు.
మే 31 నాటి బైడెన్ ట్విట్టర్ ఖాతా ఆర్కైవ్‌లను పరిశీలించగా, బైడెన్ రాహుల్ గాంధీ పై ట్వీట్ చేసినట్లు మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. పైగా, సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషించే సోషల్ బ్లేడ్ అనే వెబ్‌సైట్ ఆధారంగా బైడెన్ మే 31న ఎటువంటి ట్వీట్‌ను తొలగించలేదని కూడా నిర్ధారించవచ్చు.
చివరిగా, జో బైడెన్ రాహుల్ గాంధీని అవమానిస్తూ ఎటువంటి ట్వీట్ చేయలేదు.