Fake News, Telugu
 

గల్వాన్ ఘటనలో 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారని జియాన్లీ యాంగ్ తెలిపినట్టు షేర్ అవుతున్నది ఫేక్ వార్త

0

నిజానికి గల్వాన్ సంఘటనలో 100 మందికి పైగా చైనీస్ సైనికులు చనిపోయారు. ఈ విషయం బయటకు తెలిస్తే తనకు పదవీ గండమని జిన్‌పింగ్ ఈ విషయాన్ని బయటకు రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు’, అని  చైనా మాజీ సైనిక అధికారి జియాన్లీ యాంగ్ చెప్పినట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 148 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు చైనా మాజీ సైనిక అధికారి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడని మరికొందరు పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గల్వాన్ ఘటనలో 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారని తెలిపిన చైనా మాజీ సైనిక అధికారి జియాన్లీ యాంగ్.

ఫాక్ట్ (నిజం): గల్వాన్ ఘటనలో 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారని జియాన్లీ యాంగ్ ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు జియాన్లీ యాంగ్ చైనా మాజీ సైనిక అధికారి కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయాన్ని గూగుల్ లో వెతకగా, పోస్ట్ లోని వ్యాఖ్యలు చైనా మాజీ సైనిక అధికారి జియాన్లీ యాంగ్ చేసినట్టు చెప్తూ కొన్ని వార్తసంస్థల వెబ్సైటులు [‘Ntv Telugu’ (ఆర్కైవ్డ్), ‘ap7am’ (ఆర్కైవ్డ్), ‘Telugu One’ (ఆర్కైవ్డ్) మరియు ‘Telugu Stop’ (ఆర్కైవ్డ్)] కూడా ఆర్టికల్స్ ప్రచురించినట్టు తెలుసుతుంది.

నిజంగా ఆ వ్యాఖ్యలు జియాన్లీ యాంగ్ చేసాడా అని వెతకగా, తను ఆ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా ఆధారాలు దొరకలేదు. అయితే, గల్వాన్ ఘటనలో చనిపోయిన చైనా సైనికుల వివరాలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పట్లేదని, అదే భారత్ ప్రభుత్వం మాత్రం తమ సైనికులకు ఘన నివాళి ఇచ్చినట్టు చెప్తూ తాజాగా ‘ది వాషింగ్టన్ టైమ్స్’ పత్రికకు తాను రాసిన ఆర్టికల్ లో జియాన్లీ యాంగ్ పేర్కొన్నాడు. కానీ, ఆర్టికల్ లో ఎక్కడా కూడా గల్వాన్ ఘటనలో 100 మందికి  పైగా చైనా సైనికులు చనిపోయారని తను చెప్పలేదు. తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఎక్కడా పోస్ట్ చేయలేదు.

అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు జియాన్లీ యాంగ్ చైనా మాజీ సైనిక అధికారి కాదు. తను చైనీస్ కమ్యూనిజం యొక్క అసమ్మతివాది; అమెరికా లో ఉంటూ, చైనాలో ప్రజాస్వామ్యం తేవడానికి కృషి చేస్తుంటాడు. తన గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, గల్వాన్ ఘటనలో 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారని చైనా మాజీ సైనిక అధికారి జియాన్లీ యాంగ్ తెలిపినట్టు షేర్ అవుతున్నది ఫేక్ వార్త.

Share.

About Author

Comments are closed.

scroll