ఇదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎటువంటి ఉచిత పథకాల ఊసే లేదని, ఇందుకు గాను మోదీని అభినందిస్తూ ‘ప్రజా ధనాన్ని మోదీ కాపాడుతున్న తీరు అబ్బురపరుస్తోంది, ఆయనకు నా సంపూర్ణ మద్దతు’ అని మాజీ ఐఏఎస్ అధికారి జయ ప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించినట్టు చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ప్రజా ధనాన్ని మోదీ కాపాడుతున్న తీరు అబ్బురపరుస్తోంది, ఆయనకు నా సంపూర్ణ మద్దతు’- బడ్జెట్ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి జయ ప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలు.
ఫాక్ట్ (నిజం): 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం గురించి మీడియాతో మాట్లాడుతూ జయ ప్రకాష్ నారాయణ మోదీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు. ఖచ్చితంగా పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు కాకపోయినా అదే అర్ధం వచ్చే విధంగా అయన వ్యాఖ్యానించాడు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో మోదీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ని విశ్లేషిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి జయ ప్రకాష్ నారాయణ్ పలు వీడియోలను (ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ) తన ఫేస్‌బుక్ పేజీలో అప్లోడ్ చేసారు.
అదేవిధంగా జయ ప్రకాష్ నారాయణ బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన పలు న్యూస్ వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే బడ్జెట్‌పై విశ్లేషణలో ఎక్కడ కూడా జయ ప్రకాష్ నారాయణ్ మోదీని ఉద్దేశించి పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు చేయలేదు. కేవలం బడ్జెట్‌లోని మంచి, చెడు అంశాలను ప్రస్తావించాడే తప్ప, ‘ప్రజా ధనాన్ని మోదీ కాపాడుతున్న తీరు అబ్బురపరుస్తోంది, ఆయనకు నా సంపూర్ణ మద్దతు’ అన్న వ్యాఖ్య ఎక్కడా కూడా చేయలేదు.
ఐతే గతంలో కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్తగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంని (CPS) ప్రవేశాపెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ జయ ప్రకాష్ నారాయణ్ మోదీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు. జయ ప్రకాష్ నారాయణ్ ఈ వ్యాఖ్యలు 2019లో చేసాడు. ఖచ్చితంగా పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు కాకపోయినా అదే అర్ధం వచ్చే విధంగా అయన వ్యాఖ్యానించాడు.
ఐతే జయ ప్రకాష్ నారాయణ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం నేపథ్యంలో చేసిన ఈ వ్యాఖ్యలను ఇప్పుడు చేసినట్టు తపుగా షేర్ చేస్తున్నట్టు అర్ధంచేసుకోవచ్చు.
చివరగా, మోదీని ఉద్దేశించి జయ ప్రకాష్ నారాయణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపథ్యంలో చేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.