Fake News, Telugu
 

నైనిటాల్‌లోని జామా మసీదు 1882 బ్రిటిష్ కాలంలోనే నిర్మించారు. బ్రిటిష్ సైన్యంలోని ముస్లింల కోసం దీనిని నిర్మించారు

0

ఒక ఫోటోని షేర్ చేస్తూ, ఇది నైనిటాల్‌లోని ఒక మసీదు అని, ఇది 25 ఏళ్ళ క్రితం లేదని, దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. అలాగే ఈ మసీదులోని 16 పెద్ద లౌడ్ స్పీకర్లు రోజు పొద్దున్నే 4 గంటల 30 నిమిషాలకే అందర్ని నిద్రనుండి లేపేస్తాయ్ అని కూడా పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదాంట్లో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: నైనిటాల్‌లోని జామా మసీదును 25 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది; ఈ మసీదులో రోజు ఉదయం 16 పెద్ద లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తారు.

ఫాక్ట్ (నిజం): నైనిటాల్‌లోని జామా మసీదును 1882లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. నైనిటాల్ చుట్టూ సైనిక శిబిరాల్లో ఉన్న బ్రిటిష్ సైన్యంలోని ముస్లిం సైనికుల కోసం దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ మసీదులో కేవలం ఒకటే లౌడ్ స్పీకర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ లౌడ్ స్పీకర్‌ నుండి వచ్చే శబ్దం ఉత్తరఖండ్ హైకోర్టు మరియు ప్రభుత్వం సూచనలకు లోబడే ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

నైనిటాల్‌లోని జామా మసీదు నిర్మాణం:

పోస్టులో షేర్ చేసింది ఉత్తరాఖండ్, నైనిటాల్‌లోని జామా మసీదు ఫోటో. జామా మసీదు నైనిటాల్‌ ఫేస్‌బుక్‌ పేజీలో మసీదు నిర్మాణానికి సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ ఇలాంటి ఫోటోను షేర్ చేసారు (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఈ మసీదును 25 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించలేదు. దీనిని 1882, బ్రిటిష్ కాలంలో, నైనిటాల్ చుట్టూ సైనిక శిబిరాల్లో ఉన్న బ్రిటిష్ సైన్యంలోని ముస్లిం సైనికుల కోసం నిర్మించారు, తిరిగి 2004-05 లో పునర్నిర్మించారు.

పలు ట్రావెల్ మాగ్జైన్స్ మరియు వెబ్సైట్లు కూడా ఈ మసీదును 1882, బ్రిటిష్ కాలంలో నిర్మించినట్టు పేర్కొన్నాయి. కాబట్టి ఈ మసీదు 25 ఏళ్ళ క్రితం వరకు లేదని చేస్తున్న వాదన నిజం కాదని స్పష్టమవుతుంది.

మసీదులో 16 లౌడ్ స్పీకర్లు?

ప్రార్ధన స్థలాలలో లౌడ్ స్పీకర్లకు సంబంధించిన ఒక పిల్ (PIL)కు సంబంధించి 2018లో తీర్పు చెప్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు,  లౌడ్ స్పీకర్ల ద్వారా వచ్చే శబ్దం 5dB(A) కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పింది. ఈ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని మతాలకు చెందిన పెద్దలు కోర్టు తీర్పుకు కట్టుబడి లౌడ్ స్పీకర్ల నుండి వచ్చే శబ్దం 5dB(A) దాటకుండా ఉంచడానికి అంగీకరించారు.

ఐతే 2018లో హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని పొరపాట్లు ఉన్నాయంటూ 2020లో జామా మసీదు, యుఎస్ నగర్ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్  హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేయడంతో, విచారణ జరిపిన హైకోర్టు 2018 తీర్పులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని అంగీకరిస్తు, ఆ తీర్పుకు కొన్ని సవరణలు చేసింది.

సాధారణంగా మనిషి ఊపిరి తీసుకునేటప్పుడు వచ్చే శబ్దం 10dB(A) ఉంటుందని, చట్టం ప్రకారం, నివాస ప్రాంతాలలో పగటిపూట 55 dB(A) వరకు మరియు రాత్రి 45 dB(A) వరకు శబ్దాలకు అనుమతించబడుతుంది. ఈ నేపథ్యంలో 2018 తీర్పులో కొన్ని క్లెరికల్ పొరపాట్లు ఉన్నాయని, ఆ తీర్పుకు సవరణలు చేస్తూ ప్రార్ధనా స్థలాలలో లౌడ్ స్పీకర్ల నిషేదాన్ని ఎత్తేస్తూ తీర్పు చెప్పింది.

ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని ప్రార్ధనా స్థలాలు కోర్టు సూచించిన పరిమితులకు లోబడే స్థలాలలో లౌడ్ స్పీకర్లను వినియోగిస్తున్నాయి. ఇదే విషయాన్ని విశ్వాస్ న్యూస్ నైనిటాల్‌లోని రిపోర్టర్లను సంప్రదించి స్పష్టం చేసింది. నైనిటాల్‌లోని జామా మసీదులో ప్రస్తుతం కేవలం ఒకటే లౌడ్ స్పీకర్‌ను వినియోగిస్తున్నట్టు కూడా తమ కథనంలో పేర్కొంది.

చివరగా, నైనిటాల్‌లోని జామా మసీదులో 1882 బ్రిటిష్ కాలంలోనే నిర్మించారు. బ్రిటిష్ సైన్యంలోని ముస్లింల కోసం దీనిని నిర్మించారు.

Share.

About Author

Comments are closed.

scroll