మోదీ క్రికెట్ ఆడిన వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: నరేంద్ర మోదీ క్రికెట్ ఆడుతున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో క్రికెట్ ఆడుతూ కనిపించేది క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్. యోగ్‌రాజ్ సింగ్ ఇదే వీడియోను 12 మార్చ్ 2023న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసాడు. ఇకపోతే కోహ్లి, రోహిత్‌లతో కలిసి మోదీ నిలబడి ఉన్న ఫోటో, ఇటీవల బోర్డర్- గవాస్కర్ సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో మోదీ, టీం ఇండియాతో కలిసి జాతీయ గీతం పాడినప్పుడు తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డర్- గవాస్కర్ సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను భారత ప్రధాని మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ క్రికెట్ ఆడుతున్న ఈ వీడియో షేర్ అవుతోంది.
ఐతే నిజానికి వీడియోలో క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నది మోదీ కాదు. వీడియోలో ఉన్నది మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్. ఈ వీడియోకు సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఇవే దృశ్యాలు మాజీ క్రికెటర్ & యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఇన్స్టాగ్రామ్‌లో కనిపించాయి.
యోగ్‌రాజ్ సింగ్ 12 మార్చ్ 2023న తన కొత్త క్రికెట్ అకాడమీ గురించి చెప్తూ ఈ వీడియోను షేర్ చేసాడు. ఐతే యోగ్‌రాజ్ సింగ్ ఇలాంటిదే ఒక ఒక వీడియోను గత సంవత్సరం కూడా షేర్ చేసాడు.
ఇకపోతే వైరల్ వీడియోలో కోహ్లి, రోహిత్‌లతో కలిసి మోదీ నిలబడి ఉన్న ఫోటో ఇటీవల బోర్డర్- గవాస్కర్ సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో మోదీ, టీం ఇండియాతో కలిసి జాతీయ గీతం పాడినప్పుడు తీసింది. ఐతే ఈ వైరల్ ఫోటోలో మోదీ తలకు రోహిత్ శర్మ బాడీని డిజిటల్‌గా అతికించారు.
చివరగా, ఈ వీడియోలో క్రికెట్ ఆడుతూ కనిపించేది యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్, మోదీ కాదు.