‘బెంగాల్ హింసాకాండపై మోడీ ప్రభుత్వ చర్య ప్రారంభమైందని, ఇందుకోసం రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ ప్రభుత్వం బెంగాల్‌లో విధించిందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బెంగాల్ హింసాకాండపై మోదీ ప్రభుత్వ చర్య ప్రారంభమైందని, ఇందుకోసం రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ ప్రభుత్వం బెంగాల్‌లో విధించింది.
ఫాక్ట్: గత సంవత్సరం ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగానే విమర్శించింది. ఐతే ఈ నేపథ్యంలో ఆర్టికల్ 256 & 257(1) ఉల్లంఘన జరిగిందని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబోతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇలా 256 & 257(1) ఉల్లంఘన కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
గత సంవత్సరం బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలను కట్టడి చేసే విషయానికి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే ఈ హింసను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర గవర్నర్ విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ దనకర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మరియు డీజీపితో మాట్లాడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన అసహనం వ్యక్తం చేసారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన హింసకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక రిపోర్ట్ కోరడంతో పాటు కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో కూడా పర్యటించారు. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఈ అల్లర్ల నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 & 257 ఉల్లంఘించినందుకు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించబోతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
ఆర్టికల్ 256 & 257:
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 256 & 257(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కేంద్ర చట్టాలకు లోబడి ఉండాలి. అలాగే కేంద్ర అధికారాలకు అడ్డుపడకుండా/వ్యతిరేకంగా, రాష్ట్రాలు తమ అధికారాలను ఉపయోగించుకోకూడదు. ఒకవేళ ఇలా జరగని సందర్భంలో, తమ ఆదేశాలను పాటించాల్సిందిగా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించవచ్చు కూడా.
ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్టికల్ 256 & 257(1) అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైనా ఒక చట్టమో లేదా కేంద్ర ప్రభుత్వ ఆదేశానికి మాత్రమే ఉద్దేశించబడుతుంది. అంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆదేశాలకు/చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహారించినప్పుడు, కేంద్రం ఆర్టికల్ 256 & 257(1) ప్రకారం తమ ఆదేశాలను పాటించాలని కోరుతుంది, ఇది కేవలం ఆ ఒక్క అంశానికి మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని, ఆర్టికల్ 256 & 257(1) ఉల్లంఘన వల్ల రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు మాత్రం లేవు.
పైగా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆదేశాలు పాటించని సందర్భాలలో, ఇది ఆర్టికల్ 256 & 257(1) ఉల్లంఘన కింద పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐతే అప్పుడు ఈ ఉల్లంఘన ఆధారంగా రాష్ట్రపతి పాలన మాత్రం విధించలేదు.
సాధారణంగా మన రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితా రూపంలో కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) అధికారాలను కేంద్ర మరియు రాష్ట్రాలకు విభజించారు. ఐతే ఒక్కోసారి ఒకరి పరిమితులు దాటి ఇంకొకరు వెళ్ళే సందర్భాలు సహజం. ఇలాంటి పరిస్థితులలో ఎదుర్కోవటం కోసమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ద్వారా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేసారు. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య విభేదాలను ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌లో చర్చల ద్వారా పరిష్కరించుకోని దేశ సమాఖ్య(ఫెడరల్) స్ఫూర్తిని కాపాడడానికే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసారు.
ఇకపోతే పోస్టులో చెప్తున్న రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ, జనాభా నియంత్రణ బిల్లు మరియు దేశంలో ముస్లింల జనాభా మొదలైన అంశాలకు సంబంధించి వివరణ కింద చూద్దాం.
రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ:
గత నెల ప్రారంభంలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈ గెలుపుతో 1988-90 తర్వాత రాజ్యసభలో రెండంకెల సంఖ్యను దాటిన మొదటి పార్టీగా BJP అవతరించింది. ఐతే రాజ్యసభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 2024 నాటికి రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని పత్రికా కథనాల ప్రకారం తెలుస్తుంది (ఇక్కడ మరియు ఇక్కడ).
జనాభా నియంత్రణ బిల్లు:
2019లో రాకేశ్ సిన్హా అనే బీజేపీ ఎంపీ దేశంలో ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేయాలని పార్లిమెంట్‌లో ఒక ప్రైవేటు మెంబెర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఐతే ఇటీవల జరిగిన పార్లిమెంట్ సమావేశాలలో కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ బిల్లుకు సంబంధించి వివరణ ఇచ్చిన అనంతరం రాకేశ్ సిన్హా తను ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్నారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఇలా చట్టాల ద్వారా కాకుండా ప్రజలలో సామాజిక అవగాహన కల్పించి జనాభా నియంత్ర కోసం ప్రయత్నిస్తామని తెలిపాడు. దీన్నిబట్టి, ఈ మధ్య కాలంలో బీజేపీకి జనాభా నియంత్రణ బిల్లు తీసుకొచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవుతుంది.
దేశంలో ముస్లింల జనాభా:
స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏళ్లలో భారతదేశంలో ముస్లింల జనాభా 30 మిలియన్ల నుండి 300 మిలియన్లకు పెరిగిందని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. అయితే, 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, దేశంలోని మొత్తం ముస్లిం జనాభా 17.22 కోట్లు, ఇది భారతదేశ జనాభాలో 14.2%.
ఐతే 2015లో అమెరికాకు చెందిన Pew Research Center అనే సంస్థ చేసిన రీసెర్చ్ ప్రకారం 2020లో భారతదేశంలో ముస్లింల జనాభా 213 మిలియన్లని, ఇది 2050కి 311 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దీన్నిబట్టి పోస్టులో ముస్లింల జనాభాకు సంబంధించి చెప్తున్నది కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.
చివరగా, పశ్చిమ బెంగాల్‌లో ఆర్టికల్ 256 & 257 ఉల్లంఘన జరిగినందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబోతుందన్నది నిజం కాదు.