Fake News, Telugu
 

2017లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికలో రిపోర్ట్ అయిన ఈవీఎం లోపానికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను ఇప్పుడు షేర్ చేస్తున్నారు

0

ఇటీవల (2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో) ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి వాటి ఫలితాలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఈవీఎం అక్రమాలకు పాల్పడిందని ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలో తలెత్తిన ఈవీఎం లోపానికి  సంబంధించి ‘ఏ మీట నొక్కినా బీజేపీకే ఓటు పడుతోంది’ అనే శీర్షికతో ప్రచురించిన ఒక న్యూస్ క్లిప్‌ను తమ వాదనకు మద్దతుగా షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ ఈవీఎం అక్రమాలకు పాల్పడింది.

ఫాక్ట్(నిజం): ఈ న్యూస్ క్లిప్‌ 2017లో మధ్య ప్రదేశ్ రాష్ట్రం అటర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక సందర్భంలో నిర్వహించిన మాక్ టెస్ట్‌లో తలెత్తిన ఈవీఎం లోపానికి సంబంధించింది. అప్పుడు ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిష్కరించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఇలాంటి ఘటన రిపోర్ట్ కాలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ ఈవీఎం అక్రమాలకు పాల్పడి గెలిచిందన్న వాదనకు మద్దతుగా ప్రస్తుతం షేర్ చేస్తున్న న్యూస్ క్లిప్‌ పాతది. ఈ న్యూస్ క్లిప్‌తో ఇటీవల జరిగిన ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు.

ఈ న్యూస్ క్లిప్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వార్త మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని  అటర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికకు సంబంధించిందని స్పష్టమవుతుంది. ఈ వివరాల ఆధారంగా ఇంటర్నెట్‌లో వతకగా ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఏప్రిల్ 2017లో అటర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగగా, ఎన్నిక ముందు జర్నలిస్టుల సమక్షంలో జరిగిన మాక్ టెస్ట్‌లో ఏ బటన్ నొక్కినప్పటికీ, ఒక VVPAT కేవలం బీజేపీ గుర్తు యొక్క స్లిప్పులను మాత్రమే విడుదల చేసింది.

ఐతే ఈ ఘటనకు సంబంధించి వివిధ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఎన్నికల కమిషన్ అక్కడికి ఉన్నతాధికారులతో పాటు టెక్నికల్ టీంను పంపించి సమస్యను పరిష్కరించింది. ఈ ఘటనకు సంబంధించి అప్పటి ఎన్నికల కమిషనర్ నసిమ్ జైదీ వివరణ ఇస్తూ అటర్ ఉపఎన్నికకు సంబంధించి నిర్వహించిన మాక్ టెస్ట్‌లో అక్కడి అధికారులు కాన్పూర్ నుండి వచ్చిన VVPATలలోని మెమరీను తోలిగించకుండా వాడడంతో ఈ సమస్య వచ్చిందని, కాని ఈవీఎంలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసాడు. ఈవీఎంల టాంపరింగ్ జరిగిందన్న వార్తలను ఆయన ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ క్లిప్‌ను ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించిన ఘటనలు నమోదైనప్పటికీ, ఇలా ఏ బటన్ నొక్కినప్పటికీ బీజేపీ గుర్తు యొక్క స్లిప్పులు వచ్చిన ఘటనలేవి రిపోర్ట్ కాలేదు.

చివరగా, 2017లో  మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికలో రిపోర్ట్ అయిన ఈవీఎం లోపానికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll