Fake News, Telugu
 

గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్ల తేడాతో 100 సీట్లకు పైగా ఓడిపోయినట్టుగా షేర్ చేస్తున్న సమాచారం తప్పు

0

గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ 100కు పైగా సీట్లు కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. అక్బరుద్దీన్ ఒవైసీ మరియు అరవింద్ కేజ్రీవాల్‌కు ముఖ్యమైన లక్ష్యం బీజేపీని ఓడించడం కాదని, కాంగ్రెస్‌కు పడే ఓట్లను చీల్చి బీజేపీని గెలిపించడమే వీరి లక్ష్యమని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ 1000 ఓట్ల తేడాతో 100 సీట్లకు పైగా ఓడిపోయింది.

ఫాక్ట్ (నిజం): గుజరాత్ ఎన్నికలలో కేవలం రాపర్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ 1000 వోట్ల కన్నా తక్కువ తేడాతో ఓడిపోయింది. రాపర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు వీరేంద్రసిన్హ బహదూరసింహ్ జడేజా, కాంగ్రెస్ ప్రత్యర్ధి భాచూభాయ్ ధరంషి ఆరేతియాపై కేవలం 577 వోట్ల మెజారిటీతో గెలిచారు. మిగితా ఏ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ 2000 వోట్ల కన్నా తక్కువ తేడాతో ఓడిపోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాకు భారత ఎన్నికల కమిషన్ (ECI) వెబ్సైట్లో దొరికాయి. ప్రతి నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్ధి ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం ఎన్నికల కమిషన్ తమ వెబ్సైట్లో తెలిపింది.

ఎన్నికల కమిషన్ తెలిపిన ఈ వివరాల ప్రకారం ఇటీవల జరిగిన 2022 గుజరాత్ ఎన్నికలలో కేవలం రాపర్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ 1000 వోట్ల కన్నా తక్కువ తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోయినట్టు తెలిసింది. రాపర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు వీరేంద్రసిన్హ బహదూరసింహ్ జడేజా, కాంగ్రెస్ ప్రత్యర్ధి భాచూభాయ్ ధరంషి ఆరేతియాపై కేవలం 577 వోట్ల మెజారిటీతో గెలిచారు. మిగితా ఏ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధులు 2000 వోట్ల కన్నా తక్కువ తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోలేదు.

గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా సోంనాథ్, చనాస్మ మరియు ఖేడ్‌బ్రహ్మ నియోజకవర్గాలలో  2000 వోట్ల కంటే తక్కువ తేడాతో బీజేపీ అభ్యర్ధులపై గెలుపొందింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో తెలుపుతున్నట్టు గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లు కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ 1000 ఓట్ల తేడాతో 100 సీట్లకు పైగా ఓడిపోయిన్నట్టుగా షేర్ చేస్తున్న సమాచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll