ఖలీస్థాని ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత్ పాల్ సింగ్‌తో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి ఉన్న ఫోటో అంటూ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ ఫొటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఖలీస్థాని ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత్ పాల్ సింగ్‌తో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి ఉన్న ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫొటోలో రాహుల్ గాంధీతో పాటు ఉన్నది అమృత్ పాల్ సింగ్ కాదు. జనవరి 2023లో పంజాబ్‌లోని హోషియార్పూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగినప్పుడు నిహాంగ్ సిక్కులు రాహుల్ గాంధీని కలిసారు. ఈ ఫోటో ఆ సందర్భంలో తీసిందే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో గత సంవత్సరం రాహుల్ గాంధీ పంజాబ్‌లో భారత్ జోడో యాత్ర చేసినప్పటిది. ఐతే ఈ ఫొటోలో రాహుల్ గాంధీతో పాటు ఉన్నది అమృత్ పాల్ సింగ్ కాదు. అమృత్ పాల్ సింగ్ ఫోటోను ఈ ఫొటోతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
అలాగే ఈ ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను జనవరి 2023లో ప్రచురించిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం పంజాబ్‌లోని హోషియార్పూర్ పట్టణంలో రాహుల్ గాంధీ యాత్ర జరుగుతున్న సమయంలో అతన్ని అనేక మంది కలిసారు. అందులో నిహాంగ్ సిక్కులు కూడా ఉన్నారు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో కూడా ఆ టైంలో రాహుల్ గాంధీని ఒక నిహాంగ్ సిక్కు కలిసినప్పటిది.
ఇతను ఒక సాధారణ వ్యక్తి. ఇదే ఫోటోను అప్పట్లో యూత్ కాంగ్రెస్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. దీన్నిబట్టి ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అమృత్ పాల్ సింగ్ అని తప్పుగా అర్ధం చేసుకొని షేర్ చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, ఈ ఫొటోలో రాహుల్ గాంధీతో పాటు ఉన్నది అమృత్ పాల్ సింగ్ కాదు.