Fake News, Telugu
 

చంద్రయాన్-3 విజయం వెనక రహస్యం ‘ఋగ్ వేదం’ అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అనలేదు

0

చంద్రయాన్-3  విజయం వెనుక రహస్యం ‘ఋగ్ వేదం’ అని ఇస్రో చీఫ్ పేర్కొన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. శాస్త్రీయ ఆవిష్కరణలు వేదాలలో ఉన్నాయని, విశ్వం యొక్క నిర్మాణం, లోహశాస్త్రం మరియు విమానయానం కూడా మొదట వేదాలలో కనుగొనబడ్డాయి, వాటిని మేము విశ్లేషణ చేసిన తరువాత మూన్ మిషన్ మొదలు పెట్టామని ఇస్రో చీఫ్ అన్నట్టు కూడా ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: చంద్రయాన్-3  విజయం వెనుక రహస్యం ఋగ్ వేదం – ఇస్రో చీఫ్ సోమనాథ్

ఫాక్ట్(నిజం):  చంద్రయాన్-3 విజయానికి రహస్యం ‘ఋగ్ వేదం’ అని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఐతే గతంలో ఒక సందర్భంలో వేదాలు మరియు సంస్కృతం గురించి మాట్లాడుతూ ఖగోళ శాస్త్రంలో సంస్కృత రచనల గురించి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని చంద్రయాన్3 విజయానికి ఆపాదించి ఉండవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 నిన్న విజయవంతం అయిన నేపథ్యంలో, ఈ చంద్రయాన్-3  విజయం వెనక రహస్యం ‘ఋగ్ వేదం’ అని ఇస్రో చీఫ్ వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే నిన్న ఈ మిషన్ విజయవంతం అయిన అనంతరం ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ వ్యాఖ్యలు చేయలేదు.

చంద్రుడిపై ల్యాండర్ దిగిన అనంతరం ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మీడియాతో మాట్లాడిన విషయాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. పోస్టులో చెప్తున్నట్టు ఋగ్ వేదం గురించి అతను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఐతే గతంలో ఒకసారి మహర్షి పాణిని సంస్కృత మరియు వేద విశ్వవిద్యాలయం యొక్క స్నాతకోత్సవం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వేదాలు మరియు సంస్కృత గొప్పతనం గురించి మాట్లాడారు. ‘ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాషలలో సంస్కృతం ఒకటి, కవిత్వం, తత్వశాస్త్రం, సైన్స్, టెక్నాలజీ, గణితం మొదలైనవి రచనలు కూడా సంస్కృతంలో ఉండేవని ఆయన అన్నారు. సంస్కృతంలో తాను చదివిన మొదటి పుస్తకం ‘సూర్య సిద్ధాంతం’, సౌర వ్యవస్థ గురించి, సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా కదులుతాయి, ఈ కదలిక యొక్క సమయ ప్రమాణాలు మొదలైన వాటి గురించి చర్చిస్తుందని’ అన్నారు.

ఐతే ఋగ్ వేదంలో ఖగోళ శాస్త్రం గురించి ప్రస్తావనలు ఉన్నప్పట్టికీ, ఈ ప్రసంగంలో గానీ లేక మరేతర సందర్భంలోనైనా ప్రత్యేకించి చంద్రయాన్-3 ప్రయోగంలో ఋగ్ వేదం యొక్క పాత్ర ఉందని సోమనాథ్ అన్నట్టు రిపోర్ట్స్ అయితే లేవు.  దీన్నిబట్టి ఇస్రో చైర్మన్ గతంలో ఖగోళ శాస్త్రం మరియు వేదాల గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చంద్రయాన్ విజయానికి ఆపాదించారని అర్ధం చేసుకోవచ్చు.

చంద్రయాన్-3 మిషన్ వెనక చాలా మంది, సంస్థల కృషి, సహకారం ఉన్నట్టు ఇస్రో వెబ్సైటులో ఉన్న అధికారిక సమాచారం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, చంద్రయాన్-3 విజయం వెనక రహస్యం ‘ఋగ్ వేదం’ అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll