Fake News, Telugu
 

ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వధూవరులు చనిపోలేదు; యథావిధిగా పెళ్లి కూడా జరిగింది.

0

తమ వివాహ వేదిక వద్దకు హెలికాప్టర్లో వధూవరులు వస్తున్నారని, అయితే ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరూ మరణించారని చెప్తూ హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలను చూపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: వివాహ వేదిక వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వధూవరులు చనిపోవడాన్ని చూపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్: 2018 బ్రెజిల్ దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహ వేదిక వద్దకు వధువును తీసుకువస్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకి గాయాలు కాగా వధువు సురక్షితంగానే బయటపడింది. యథావిధిగా పెళ్లికూడా జరిగింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ ఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో లభించింది. ఈ ఘటన బ్రెజిల్‌ దేశంలో విన్హేడో అనే పట్టణంలో 05 మే, 2018 లో జరిగినట్లుగా వీడియో కింద వివరణలో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న అతిధులు హెలికాప్టర్లో ఉన్న ప్రయాణికులని కాపాడటం చూడవచ్చు.

వార్తా కథనాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయానికి హెలికాప్టర్‌లో పెళ్ళికూతురు, పైలట్ తో సహాయ మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాల కాగా, పెళ్ళికూతురు గాయపడలేదని, పైగా యథావిధిగానే పెళ్లి జరిగిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్‌కి అక్కడే ఉన్న టవర్ తగలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అతిధులు చెప్పారు.

చివరిగా, వైరల్ పోస్టులో చెప్పినట్లుగా హెలికాప్టర్ ప్రమాదంలో వధూవరులు చనిపోలేదు. యథావిధిగా పెళ్లి కూడా జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll