Fake News, Telugu
 

క్రైస్తవ మతప్రచారం చేయకూడదు అనే బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించలేదు

0

ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశంలో క్రైస్తవ మత ప్రచారం చేయకూడదు అనే బిల్‌ను ప్రవేశపెట్టిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశంలో క్రైస్తవ మత ప్రచారం నిషేదిస్తూ ఒక బిల్‌ను ప్రవేశపెట్టింది.

ఫాక్ట్(నిజం): సంకీర్ణ ప్రభుత్వంలో సభ్యులైన UTJ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు క్రైస్తవ మతమార్పిడిని ప్రోత్సహించే వారికి జైలు శిక్ష ప్రతిపాదించిన విషయం నిజమైనప్పటికి, ఈ బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం తెలపలేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలను తాము ఆమోదించమని స్పష్టం చేస్తూ ట్వీట్ చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇజ్రాయెల్‌లో ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో సభ్యులైన యునైటెడ్ తోరా జుడాయిజం (UTJ) పార్టీకి చెందిన ఇద్దరు సభ్యలు జనవరిలో క్రైస్తవ మతమార్పిడిని ప్రోత్సహించే వారికి జైలు శిక్ష విధించేలా ఒక చట్టాన్ని ప్రతిపాదించినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది.

మతం మారమని ప్రోత్సహించిన వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించేలా, అలాగే మైనర్‌ను మతం మార్చమని ప్రోత్సహించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించేలా, ఈ చట్టాలలో ప్రతిపాదించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఐతే ఇజ్రాయెల్‌ పార్లమెంట్ ఈ బిల్లును పాస్ చేయలేదు. ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ బిల్లులకు సంబంధించి ఎటువంటి కదలిక లేదని ఈ విషయాన్ని బైటపెట్టిన ఆల్ ఇజ్రాయెల్‌ న్యూస్ అనే వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

బిల్లు ఆమోదించమని నెతన్యాహు స్పష్టం చేసారు:

ఐతే ఈ బిల్లును క్రైస్తవ సంస్థలు వ్యతిరేకించిన నేపథ్యంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలను తాము ఆమోదించమని తెలుపుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ట్వీట్ ద్వారా తెలిపాడు.

బిల్ ప్రతిపాదించిన ఇద్దరు UTJ పార్టీ సభ్యులలో ఒకరైన మోషే గఫ్ని, ఈ విషయంపై స్పందిస్తూ, తాము కేవలం నామమాత్రంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టమని, బిల్లును ఆమోదింపచేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసాడు.

మోషే గఫ్ని గతంలో కూడా ఇలాంటి బిల్లులను ప్రతిపాదించాడని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. గతంలో ఇతరులు కూడా క్రైస్తవ ప్రచారాన్ని అడ్డుకుంటూ బిల్లులు ప్రతిపాదించినప్పటికీ, అవి పాస్ కాలేదని తెలుస్తుంది.

చివరగా, క్రైస్తవ మత మార్పిడిని వ్యతిరేకిస్తున్న బిల్లును ఆమోదించమని ఇజ్రాయెల్ నెతన్యాహు స్పష్టం చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll